ప్రతిపక్ష నాయకుడి రాజీనామాకు సీఎం డిమాండ్

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 1000 రోజుల నుంచి ఫామ్ హౌస్ లో సేద తీరుతున్న కేసీఆర్ బయటకు రావడం లేదని, అటువంటి వ్యక్తి రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అంతేకాదు, మండల కేంద్రాలతో మొదలుబెట్టి ఇందిరా పార్క్ వరకు దశలవారీగా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ డిమాండ్ తో నిరసనలు చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో 100 రూపాయల పెట్రోల్ కొని తెచ్చుకొని ఒంటి మీద పోసుకొని నిప్పంటించుకుంటున్నట్లు కొందరు డ్రామాలాడారని విమర్శించారు. కానీ, 10 పైసల అగ్గిపెట్టె తెచ్చుకోలేదని, అటువంటి అగ్గిపెట్టెరావుల వల్ల తెలంగాణలో శ్రీకాంతా చారి వంటి యువకులు ఆత్మాహుతి చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆనాడే ఎవరైనా 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె కొని ఇచ్చి ఉంటే ఈ రోజు తెలంగాణకు ఈ దరిద్రం ఉండేది కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పందికొక్కులా ప్రజల సొమ్ము మెక్కి ఫాం హౌస్ లో పడుకుంటే సరిపోయిందా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. దేవంలో ఏ ప్రతిపక్ష నాయకుడు ఇలా మొహం చాటేయ లేదని విమర్శించారు.

ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఫల్యం చెందిన రాష్ట్రం తెలంగాణ అని, ఇటువంటి విచిత్ర పరిస్థితి తెలంగాణకు వచ్చిందని, ప్రభుత్వ సొమ్ము మెక్కిన పందికొక్కు కేసీఆర్ రాజీనామా చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఇన్ని రోజులు కేసీఆర్ కు సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూప్ వాహనాలు, ఇలా మొత్తం ఖర్చు 22 కోట్లు అయిందని విమర్శించారు.

ఉద్యోగి అయినా ఉద్యోగానికి రాకుంటే డిస్మిస్ చేస్తారని, మరి కేసీఆర్ ను ఏం చేయాలని ప్రశ్నించారు. ‘‘దుర్మార్గుడా నీ మనవడికి దెబ్బ తగిలితే ఆస్పత్రికి పోతవ్…బంధువులు చనిపోతే దినానికి పోతవ్… కానీ, ప్రజల కోసం అసెంబ్లీకి, బయటకు రావు’’ అంటూ కేసీఆర్ పై రేవంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు.