ఏపీ మంత్రుల‌పై తెలంగాణ మంత్రుల ఆగ్ర‌హం…?

కేంద్రంలో ఏపీ నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఒక‌రు పౌర విమానయాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు, మ‌రొక‌రు గుంటూరుకు చెందిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ స‌హాయ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌. మూడో మంత్రి శ్రీనివాస వ‌ర్మ‌. వీరంతా త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో బాగానే ప‌నిచేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు చేరువ‌గానే ఉంటున్నారు. జాతీయ స్థాయిలోనూ వీరి ప‌నితీరు బాగుందని ప్ర‌ధాని మోడీ కితాబు నిస్తున్నారు. ఇక‌, ఏపీలోనూ వీరి ప‌నితీరుకు చంద్ర‌బాబు మంచి మార్కులే వేస్తున్నారు.

కానీ.. మ‌రో తెలుగు రాష్ట్రం తెలంగాణలో మాత్రం ఈ మంత్రుల వ్య‌వ‌హారంపై రాజ‌కీయ వ‌ర్గాలు… ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేత‌లు గుర్రుగా ఉంటున్నారు. వీరిపై అడ‌పా ద‌డ‌పా విమ‌ర్శ‌లు కూడా సంధిస్తున్నారు. దీనికి కారణం.. త‌మ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల‌ను ముందుకు తీసుకువెళ్ల‌డంలో స‌హ‌క‌రించ‌డం లేదనే!. అదే స‌మయంలో త‌మ‌కు స‌మ‌యం కేటాయించ‌డం లేద‌ని కూడా కాంగ్రెస్ నేత‌లు వాపోతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యాన్ని విస్త‌రించాల‌ని నిర్ణ‌యించారు.

దీనికి సంబంధించి మంత్రి రామ్మోహ‌న్‌ను క‌లుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా.. కేవ‌లం ఆయ‌న ఒకే ఒక్క‌సారి స్పందించార‌న్న‌ది కాంగ్రెస్ నాయ‌కులు చెబుతున్న మాట‌. వ‌చ్చిన త‌ర్వాత‌కూడా.. ప్రాజెక్టుపై స‌రైన దృష్టి పెట్ట‌డం లేద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కేంద్ర మంత్రులుగా ఉన్న‌వారు కాంగ్రెస్ పాలిత‌ రాష్ట్రాల‌ను కూడా ప‌ట్టించుకోవాల‌న్న‌ది ఆయ‌న మాట‌. ఇక‌, పెమ్మ‌సాని విష‌యానికి వ‌స్తే.. రాష్ట్రంలో కేంద్రం చేప‌డుతున్న ప్రాజెక్టుల‌కు సంబంధించిన విష‌యాల‌ను త‌మ‌తో పంచుకోకుండానే.. ఆయ‌న ప్ర‌క‌టించేస్తున్నార‌ని నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక‌, న‌ర‌సాపురం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భూప‌తిరాజు శ్రీనివాస‌వ‌ర్మ‌పై మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు. వాస్త‌వానికి తెలంగాణ‌లోనూ ఇద్ద‌రు కేంద్ర మంత్రులు ఉన్నారు. అయితే.. అక్క‌డ వారికి రాజ‌కీయ పోరాటాలే స‌రిపోతున్నాయి. దీంతో అభివృద్ధిపై పెద్ద‌గా దృష్టిపెట్ట‌డం లేద‌నే వాద‌న ఉంది. ఈ నేప‌థ్యంలో ఏపీకి చెందిన మంత్రులు కూడా త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని నాయ‌కులు చెబుతున్నారు. ఈ విష‌యంపై ప్ర‌స్తుతం కాంగ్రెస్ మంత్రులు గుర్రుగా ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సైలెంట్ పాటించాల‌ని చెబుతున్నార‌ట‌.