వైఎస్సార్‌సీపీలో గతంలో పనిచేసిన కీలక నేత, ఇప్పుడు చక్రం తిప్పుతున్న మరో నేత మధ్య నెలకొన్న విభేదాలు క్రమంగా బహిరంగ విమర్శలకు దారితీస్తున్నాయి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కీలకంగా వ్యవహరించిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వైసీపీ అంతర్గత పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
విజయసాయిరెడ్డి విడుదల చేసిన బహిరంగ లేఖపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. జగన్ విజయసాయిరెడ్డిని ఎక్కువగా అభిమానించారని, గుర్తు చేశారు. తమను లక్ష్యంగా చేసుకుంటే తమ స్పందన కూడా గట్టిగానే ఉంటుందని హెచ్చరించారు. విజయసాయి ఆరోపణలను ఇకపై పట్టించుకోబోనని, పార్టీ నేతలు కూడా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
తనపై కేసులు నమోదైన సమయంలో తాను రాజకీయాల్లో లేనని సజ్జల పేర్కొన్నారు. 2024 తర్వాత పలువురు వైసీపీ నేతలు లిక్కర్ కేసుల్లో అరెస్టయిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. విజయసాయిరెడ్డి మాత్రం ఎందుకు అరెస్టు కాలేదనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. విజయసాయి తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని విమర్శించారు.
వైసీపీలో ఇప్పటికే నాయకత్వం, పార్టీ భవిష్యత్తుపై చర్చ జరుగుతున్న సమయంలో కీలక నేతల మధ్య బహిరంగ విమర్శలు పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. జగన్ చుట్టూ ఉండే నాయకత్వ వ్యవస్థపైనా గతంలో పలువురు నేతలు విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు విజయసాయి–సజ్జల వివాదం ఆ చర్చకు మరోసారి తెరతీసినట్లయింది.
ఇద్దరు నేతల మధ్య విభేదాలు మరింత ముదరకముందే పార్టీ అధినేత వైఎస్ జగన్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు జగన్ ప్రకటించిన నేపథ్యంలో, ముందుగా పార్టీలోని అంతర్గత విభేదాలను చక్కదిద్దుకోవడం కీలకంగా మారింది.
పార్టీకి చెందిన కీలక నేతలే బహిరంగంగా పరస్పరం విమర్శలు చేసుకోవడం కార్యకర్తల్లోనూ, ప్రజల్లోనూ ప్రతికూల సంకేతాలు పంపే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు వైసీపీకి దూరమైన నేపథ్యంలో తాజా వివాదం పార్టీ బలహీనతకు సంకేతంగా మారకుండా జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. విజయసాయిరెడ్డి–సజ్జల మధ్య మాటల యుద్ధం ఇక్కడితో ఆగుతుందా? లేక మరింత ముదురుతుందా? దీనిపై వైసీపీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
