బొత్సపై కేఏ పాల్ ఫైర్.. ‘నా కాళ్లు పట్టుకున్నావ్ గుర్తుందా…’

వైసీపీ నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రపంచంలో యుద్ధాలను ఆపేందుకు తిరుగుతుంటే తన గురించి బొత్స మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బొత్సకు మాట్లాడటమే సరిగా రాదని, ఆయన ఎలా మంత్రి అయ్యారో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.

విజయసాయిరెడ్డిని మరో కేఏ పాల్‌గా బొత్స అభివర్ణించడంపై స్పందించిన పాల్.. విజయసాయిరెడ్డి పార్టీ గురించి ప్రశ్నిస్తే బొత్స సమాధానం చెప్పలేక తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తనపై బొత్స చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.

“విజయనగరంలో లక్షల మంది ప్రజలు పాల్గొన్న సభకు వచ్చి నా పాదాల దగ్గర కూర్చొని నన్ను గెలిపించాలని అడిగింది మర్చిపోయావా? డబ్బులు అడుక్కోవడానికి వచ్చినప్పుడు ఆ విషయం గుర్తులేదా?” అని బొత్సను ఉద్దేశించి కేఏ పాల్ ప్రశ్నించారు.

ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ఆపేందుకు తాను ప్రయత్నిస్తున్నానని, అలాంటి తనపై బొత్స విమర్శలు చేయడం సరికాదని అన్నారు. తన రాజకీయ ప్రస్థానం, తాను చేస్తున్న కార్యక్రమాలపై మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం ఎందుకని ప్రశ్నించారు.