డ్రోన్ ద్వారా గిరిజనులకు వైద్య సేవలు… సరికొత్త రికార్డు

ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితమే హై టెక్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పటికీ అదే రూట్ లో పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇంతలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకుంటున్న ముఖ్యమంత్రి దేశంలో మరెక్కడా లేరని పొలిటికల్ సర్కిల్లో చెప్పుకుంటుంటారు. ప్రజలకు మరింత మెరుగ్గా సేవలందించడానికి దొరికిన ఏ ఒక్క అవకాశం కూడా మిస్ చేయకపోవడం చంద్రబాబు స్టైల్. 76 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఆలోచనలు ఎంత స్పీడ్ గా వున్నాయో చెప్పడానికి ఈ డ్రోన్ వైద్యం ఒక్కటి చాలు. ఆంధ్రప్రదేశ్ లోని దట్టమైన అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులకు డ్రోన్ ద్వారా వైద్య సేవలను అందించడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆకట్టుకుట్టుంది.

రాష్ట్రంలో దట్టమైన అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు వైద్య ఆరోగ్య సేవలు అందని ద్రాక్షగా మారింది. అడవిలో నివసించే గిరిపుత్రులకు చిన్నపాటి అనారోగ్యం వచ్చిన సమీపంలోని పట్టణాలకు పరుగులు తీయాల్సి వస్తుంది. దాంతో అనేక సార్లు ప్రాణాల మీదకు వస్తుంది. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు వున్నాయి. దీనికి పరిష్కారం గా సరికొత్త ఆలోచన చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అనారోగ్యం దరికి చేరక ముందే ఆరోగ్యాన్ని కాపాడేందుకు తగిన ముందస్తు చర్యలు తీసుకోవడం మంచిదని భావించింది. అనుకున్నదే తడవుగా ఆచరణలోకి దిగింది. డ్రోన్ ద్వారా వైద్య సేవలు అందించాలని నిర్ణయం తీసుకుంది.

ఈ ఏడాది జనవరిలో డ్రోన్ సేవలకు శ్రీకారం చుట్టింది. ముందుగా ఓ నాలుగు డ్రోన్లను ఇందుకోసం కేటాయించింది. ఈ డ్రోన్లకు అరకు పరిధిలోని పాడేరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటుగా లోథుగెడ్డ, తాజంగి, సుంకర మెట్ట, భీమవరం, అనంతగిరి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ముంచింగిపట్టు కమ్యూనిటీ ఆసుపత్రి, చింతపల్లి, అరకు ఏరియా ఆసుపత్రులతో అనుసంధానం చేశారు. కొండలు, గుట్టలు, దట్టమైన
అటవీ ప్రాంతాలకు సంబందించి సమాచారం వున్న 25 మంది గిరిజన యువతకు డ్రోన్ కార్యకలాపాలు, వినియోగంపై శిక్షణ ఇచ్చింది. డ్రోన్ వైద్యం పట్ల గిరిజనులకు అవగాహనా కల్పించింది.

గిరిజన గూడెంలలో ఎవరికైనా ఆరోగ్య సమస్య వచ్చినట్లు సమాచారం అందిన వెంటనే ఈ డ్రోన్ సేవకులు అక్కడకు చేరుకుంటారు. వైద్య పరీక్షల నమూనాలను సేకరించి సంబంధిత ఆసుపత్రికి డ్రోన్ ద్వారా పంపిస్తారు. రోగికి అవసరమైన మందులను డ్రోన్ ద్వారా తెప్పించి సకాలంలో చికిత్స అందించే ఏర్పాటు చేస్తారు. జనవరి నుంచి ఆగస్టు వరకు ఈ ఎనిమిది నెలల్లో 24,500 మందికి వైద్య సేవలు అందించి రికార్డ్ సృష్టించారు.
నాలుగు డ్రోన్లు మొత్తం కలిపి 71 వేల కిలోమీటర్లు ప్రయాణించాయి. 18 వేల ట్రిప్పులు తిరిగాయి. దీంతో గిరిజనులకు సకాలంలో వైద్య సేవలు అందుతున్నాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు పెద్దాసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇంటి దగ్గరికే వచ్చిన వైద్య సేవలతో అరకు గిరిజనుల్లో ఆనందం కనిపిస్తుంది.