తెలంగాణాలో జనసేన పాగా

చాపకింద నీరులా జనసేన విస్తరిస్తుంది. అధికారం కోసం అర్రులు చాచకుండా ఒక ప్రణాళిక ప్రకారం పునాదులు వేసుకుంటూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో బలమైన కేడర్, లీడర్ కలిగిన టీడీపీతో పొత్తు పెట్టుకొని వ్యూహాత్మకంగా అధికారం వైపు అడుగులు వేసింది. అత్యాశకు పోకుండా 21 సీట్లలో పోటీ చేయడమే కాకుండా 100 శాతం స్ట్రెయిక్ రేట్ సాధించి రికార్డ్ బద్దలు కొట్టింది. ఆంధ్ర ప్రదేశ్ లో లక్ష్యం సాధించిన తర్వాత తెలంగాణాపై దృష్టి సారించింది.

తెలంగాణాలో డిసెంబర్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దాంతో గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్ధం అవుతుందని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఒట్టి ప్రకటనతో సరిపెట్టకుండా కార్యరంగంలో దిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పోరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తలపడేందుకు ఆసక్తి కనబరుస్తున్న అభ్యర్థులతో రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. ఈ మేరకు తెలంగాణా జనసేన కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రజల దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేయాలని, ప్రధాన పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా ఆర్ధిక బలం, అంగబలం కలిగిన అభ్యర్థులను పోటీకి దించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈలోపు జనసేన కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి వ్యూహం సిద్ధం చేశారు.

అంతే కాకుండా తెలంగాణా అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఆధిపత్య పోరు నేపథ్యంలో కొందరు సీనియర్ నాయకుల మీద వేటు పడబోతుందని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో వారు జనసేనలో చేరేందుకు అవకాశం వుందని ప్రచారం జరిగింది. అదే జరిగితే తెలంగాణాలో జనసేన బలం పెరుగుతుందని నాయకులు అంచనా వేస్తున్నారు.

ఈ పరిణామాలతో బీజేపీ ఉలిక్కి పడింది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు వుంది. తెలంగాణాలో మాత్రం ఎవరితో పొత్తు పెట్టుకునేది లేదని బీజేపీ తెగేసి చెప్పింది. ఇప్పుడు జనసేన కూడా ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధం కావడంతో అంతిమంగా కమలానికి నష్టం జరుగుతుందన్న భయం కనిపిస్తుంది. జనసేన కనుక తెలంగాణాలో బోణి కొడితే రాజకీయ పరిణామాలు మారిపోయే అవకాశం వుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా వుండగా వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు పేరు ప్రకటించిన జనసేన తెలంగాణాలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.