నాపై హత్యాయత్నం కేసు పెట్టండి… సాయిరెడ్డికి సజ్జల సలహా

చాలా ఏళ్ల పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో ఒకరిగా ఉండి.. అనివార్య కారణాలతో రెండేళ్ల కిందటే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేశారు విజయ సాయిరెడ్డి. వైసీపీకి గుడ్ బై చెప్పేశాక ఇక రాజకీయాలకు దూరం అని ప్రకటించిన ఆయన.. ఇటీవల యుటర్న్ తీసుకున్నారు. కొత్త పార్టీకి సిద్ధమయ్యారు. ఇదే సమయంలో జగన్ మతమార్పిడులను ప్రోత్సహించాచారనే ఆరోపణలు చేయడంతో వైసీపీ వైపు నుంచి ఆయనపై ఎదురుదాడి తప్పలేదు. దీంతో సాయిరెడ్డి మరింత దూకుడు పెంచారు. 

జగన్‌కు అత్యంత సన్నిహితుడు.. తన తర్వాత వైసీపీలో నంబర్-2 స్థానాన్ని చేజిక్కించుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ ఒక బహిరంగ లేఖను విడుదల చేయడం ద్వారా సంచలనానికి తెర తీశారు సాయిరెడ్డి. దుమారం రేపుతున్న ఈ లేఖపై సజ్జల ఏమని స్పందిస్తారు, ఎలా ఎదురు దాడి చేస్తారు అని అందరూ ఎదురు చూస్తుండగా.. ఆయన చాలా కూల్‌గా రెస్పాండయ్యారు.

తనను జగన్ ముందే సజ్జల కొట్టాడని.. అయినా జగన్ ఏమనలేదని తన లేఖలో ఒక చోట ప్రస్తావించారు సాయిరెడ్డి. దీనిపై సజ్జల మాట్లాడుతూ.. ఇందుకు గాను తన మీద ఇప్పుడు కూడా సాయి రెడ్డి 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు పెట్టుకోవచ్చని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎలాగూ రెడ్ బుక్ పేరుతో పాత వ్యవహారాల మీద కేసులు పెట్టి వేధిస్తోందని.. 2016లో ఓ ఘటనకు సంబంధించి కేసు పెట్టారని విన్నానని.. అలాగే సాయిరెడ్డి కూడా కేసు పెట్టొచ్చని అన్నారు. 

తన మీద కేసులు కూడా లేవని సాయిరెడ్డి బాధ పడుతున్నారని.. చంద్రబాబుకు ఒక మాట చెబితే చాలు, తన మీద కేసు పెట్టేస్తారని.. సాయిరెడ్డి అలా ట్రై చేయొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఇక సాయిరెడ్డి పార్టీ పెట్టడం గురించి స్పందిస్తూ.. అది మంచిదేనని ఆయనన్నారు. సాయిరెడ్డి తన సొంత కారణాలతోనే వైసీపీని విడిచిపెట్టి వెళ్లారని.. ఇందులో తమ ప్రమేయం ఏమీలేదని.. పార్టీలోకి ఎందరో వస్తుంటారు, వెళ్తుంటారని.. దాని వల్ల పార్టీపై ఏ ప్రభావం ఉండదని సజ్జల తేల్చి చెప్పారు.