వైసీపీ ప‌రిస్థితి దారుణం… పోటీకి నేతలు ఉన్నారా?

స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ కోరుకుంటున్నారు. త‌ద్వారా.. గ‌త 2024 సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఎదురైన ప‌రాభ‌వం నుంచి బ‌య‌ట ప‌డాల‌న్న‌ది ఆయ‌న ప్లాన్‌. దీనికి సంబంధించి.. పెద్ద ఎత్తున పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు. చేస్తున్నారు. అయితే.. ఆయ‌నే ఒక కీల‌క విష‌యాన్ని వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. పార్టీ త‌ర‌ఫున‌ పోటీ చేసేందుకు స‌రైన నాయ‌కులు లేక‌పోతే.. నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వ‌య క‌ర్త‌ల కుటుంబాల‌ను రంగంలోకి దింపాల‌ని సూచించారు. ఇది మెజారిటీ ప్ర‌క‌ట‌న‌గానే చూడాల్సి ఉంది.

నిజానికి ఒక‌ప్పుడు పార్టీలో టికెట్ కోసం పోరాటం చేసిన వారు ఉన్నారు. అలిగి పార్టీపై విమ‌ర్శ‌లు చేసిన వారు కూడా ఉన్నారు. కానీ, ఇప్పుడు జ‌గ‌నే చెప్పిన‌ట్టు పార్టీ త‌ర‌ఫున అస‌లు పోటీ చేసేందుకు నాయ‌కుల కొర‌త రావ‌డం వైసీపీని వేధిస్తున్న ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇదే నిజ‌మై.. స్థానిక సంస్థ‌ల్లో పోటీ చేసేందుకు కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల కొర‌త ఏర్ప‌డితే.. అది పార్టీకి ప్ర‌మాద ఘంటిక‌ల‌ను మోగిస్తుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒక‌ప్పుడు ఉన్న ప్రాభ‌వం.. ఇప్పుడు కొర‌వ‌డుతుంద‌ని కూడా హెచ్చ‌రిస్తున్నారు.

ఎందుకిలా..?

పార్టీ త‌ర‌ఫున పోటీ చేసేందుకు నాయ‌కుల కొర‌త వెంటాడే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. జ‌గన్ ప్ర‌క‌ట‌నలేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. డీఎస్సీ వ్య‌వ‌హారంపై అందుకున్న నిర‌స‌న‌ల అజెండా విక‌టించింది. ఇది ప్ర‌జ‌ల‌కు వైసీపీని మ‌రింత దూరం చేసింది. 16 వేల ఉద్యోగాల‌ను కూట‌మి స‌ర్కారు భ‌ర్తీ చేసింద‌న్న వాద‌న వినిపిస్తున్న స‌మ‌యంలో జ‌గ‌న్ ఎత్తుకున్న అజెండాపై సొంత పార్టీలోనే విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేసింది. దీంతో పార్టీకి చాలా మంది దూరంగా ఉన్నారు. పార్టీలోనే ఉన్నా.. పోటీకి విముఖత వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక‌, రాజ‌ధాని విష‌యంలోనూ జ‌గ‌న్‌.. వేసిన అడుగులు పార్టీ నాయ‌కుల‌కు న‌చ్చ‌డం లేదు. ఒక‌వైపు అమ‌రావ‌తి పుంజుకుంటున్న ద‌రిమిలా.. ఆయ‌న మావిగ‌న్ అంటూ..జ‌పం చేస్తుండ‌డాన్ని ప్ర‌జ‌లు ఏవ‌గించుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీ త‌ర‌ఫున పోరాడినా ప్ర‌యోజ‌నం లేద‌ని.. డ‌బ్బులు ఖ‌ర్చు త‌ప్ప‌.. కూట‌మి పార్టీలో క‌య్యం త‌ప్ప‌.. త‌మ‌కు మిగిలేదిఏమీ ఉండ‌ద‌న్న అభిప్రాయం వైసీపీ నేత‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీంతో మెజారిటీ జిల్లాల్లో పోటీకి దూరంగా ఉంటున్నార‌న్న‌ది వాస్త‌వం. ఈ విష‌యాన్ని ముందుగానే ప‌సిగ‌ట్టిన జ‌గ‌న్‌.. స‌మ‌న్వ‌య క‌ర్త‌ల కుటుంబాల‌కు చెందిన వారిని నిల‌బెట్టాల‌ని పిలుపునివ్వ‌డం వైసీపీ దుస్థితిని స్ప‌ష్టం చేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.