ప్ర‌జ‌ల‌కు ప‌వ‌న్ అవ‌స‌రం… ఇదిగో రీజ‌న్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ క‌ల్యాణ్ ప్ర‌జ‌ల‌కు ఎంత అవ‌స‌ర‌మో తేల్చి చెప్పే ఉదంతం ఇది. ఆయ‌న‌ను నేరుగా క‌లుసుకుని విజ్ఞాప‌న‌లు చేసే వారు కొందరు అయితే.. ఆయ‌న‌ను క‌లుసుకోకుండా కేవ‌లం లేఖ ద్వారా స‌మ‌స్య‌లు ప్ర‌స్తావించేవారు మ‌రికొంద‌రు. స‌మ‌స్య ఏదైనా విజ్ఞాప‌న ఎలాంటిదైనా.. త‌న దృష్టికి వ‌స్తే.. దానిని తీర్చే వ‌ర‌కు నిద్ర‌పోనిత‌త్వం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ది. తాజాగా ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్నం జిల్లా రాంబిల్లి మండ‌లానికి చెందిన ప్ర‌జ‌లు చేసిన లిఖిత పూర్వ‌క విజ్ఞ‌ప్తిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆఘ‌మేఘాల‌పై స్పందించారు.

ఏంటి స‌మ‌స్య‌..?

విశాఖ‌ప‌ట్నంలోని రాంబిల్లి మండ‌లం, కృష్ణంపాలేనికి చెందిన గ్రామ‌స్తులు సుద‌ర్ఘ కాలంగా ఇక్క‌డి పారిశ్రామిక కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారు. గ‌త వైసీపీ హ‌యాంలోనూ ఇక్క‌డి ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొన్నారు. కానీ, అప్ప‌ట్లో ఎవ‌రూ వీరి బాధ‌ను వినిపించుకోలేదు. కాగా.. తాజాగా త‌న నియోజ‌క‌వ‌ర్గం కాక‌పోయినా.. కాలుష్యం స‌మ‌స్య ఉంద‌ని చెప్ప‌గానే.. డిప్యూటీ సీఎం హోదాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ వెంట‌నే రియాక్ట్ అయ్యారు. పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు అధికారులను త‌క్ష‌ణ‌మే అక్క‌డ ప‌ర్య‌టించాల‌ని ఆదేశించారు.

దీంతో హుటాహుటిన విశాఖ‌ప‌ట్నంలోని పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు అధికారులు రాంబిల్లికి చేరుకున్నారు. ఇక్క‌డి `బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్` పరిశ్రమలో త‌నిఖీలు చేశారు. యంత్రాల‌ను ప‌రిశీలించారు. కాలుష్య కార‌క వాయువుల ప‌రిస్థితిని తెలుసుకున్నారు. వెంటిలేట‌ర్ల ద్వారా వ‌స్తున్న కాలుష్య వాయువులు.. చుట్ట‌ప‌క్క‌ల ఉన్న గ్రామాల్లోని ప్ర‌జ‌లకు ఇబ్బందులు క‌లిగిస్తున్న మాట వాస్త‌వ‌మేన‌ని గ్ర‌హించారు. ఆ వెంట‌నే బాయిలర్‌ చిమ్నీకి మల్టీ సైక్లోన్‌ డస్ట్ కలెక్టర్‌ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాదు.. డ‌స్ట్ క‌లెక్ట‌ర్ ఏర్పాటు చేసే వ‌ర‌కు ప‌రిశ్ర‌మ‌లో కార్య‌క‌లాపాల‌ను నిలిపి వేయాల‌ని అధికారులు ఆదేశించారు. అనంత‌రం తాము ప‌రిశీలించి.. స‌ర్టిఫికెట్ ఇస్తామ‌ని పేర్కొన్నారు. దీంతో ప‌రిశ్ర‌మ‌కు తాజాగా తాళాలు వేశారు. ఈ చ‌ర్య‌ల ప‌ట్ల స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. డిప్యూటీ సీఎంకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ద‌శాబ్దాలుగా తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ను చిన్న లేఖ ద్వారా తెలియ‌జేయ‌డంతో వెంట‌నే ప‌రిష్క‌రించార‌ని కృత‌జ్ఞ‌తలు తెలిపారు.