సంచలనంగా మారిన సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ వ్యవహారంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. తొలుత ఈ ఉదంతంలో ఏ1గా పేర్కొన్న ఏవీ సుబ్బారెడ్డిని.. తర్వాత పోలీసులు విడిచిపెట్టటం తెలిసిందే. బుధవారం రాత్రి అయ్యప్ప సొసైటీలో మీడియా సమావేశాన్నినిర్వహించారు. మీడియా ప్రతినిధులతో ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కిడ్నాప్ వ్యవహారంలో తమకు సంబంధం లేదని.. పోలీసులు తన పేరును అనవసరంగా చేర్చారని పేర్కొన్నారు.
తనను ఇరికించే ప్రయత్నం చేసినట్లుగా ఆరోపించారు. తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నా వదిలేస్తారన్న వ్యాఖ్యను చేశారు. మీడియాతో మాట్లాడుతున్న వేళలోనే ఎంట్రీ ఇచ్చిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకెళ్లారు. అనంతరం ఆయన్ను నేరుగా బేగంపేట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది.
ఆయన్ను స్టేషన్ కు తీసుకెళ్లే సమయానికే కిడ్నాప్ కు గురైన ప్రవీణ్ రావు వర్గానికి చెందిన వారు అక్కడే ఉన్నారని తెలుస్తోంది. పోలీసులు ప్రశ్నలు వేసిన తర్వాత.. కిడ్నాప్ ఎపిసోడ్ లో ఆయనకు సంబంధం లేదని పోలీసులు నిర్దారణ కు వచ్చారు. అదే సమయంలో.. ఏవీ సుబ్బారెడ్డిపై ప్రవీణ్ వర్గీయులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
దీంతో.. ఆయనకు నోటీసులు జారీ చేసిన పోలీసులు.. ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు రావాల్సిందిగా చెప్పి పంపించేశారని చెబుతున్నారు. అయితే.. ఏవీ సుబ్బారెడ్డిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లే సమయానికే బాధిత వర్గానికి చెందిన వారు ఉండటం ఆసక్తికరంగా మారింది. తొలుత ఫిర్యాదు చేసి.. గంటల వ్యవధిలోనే వెనక్కి తీసుకోవటాన్ని పలువురు అండర్ లైన్ చేయాలని చెబుతున్నారు. తొందరపాటుకు గురి కాకుండా పోలీసులు వ్యవహరించాలన్న సూచన కొందరి నుంచి వినిపించటం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates