వైసీపీ నుంచి బయటకు వచ్చిన మహిళా నాయకురాలు.. వాసిరెడ్డి పద్మకు పొలిటికల్‌గా లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా మంత్రి నారా లోకేష్‌తో ఆమె భేటీ అయ్యారు. దీంతో త్వరలోనే ఆమె టీడీపీ కండువా కప్పుకొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ దూకుడుగా ఉండే వాసిరెడ్డి పద్మ దాదాపు 20 ఏళ్లకుపైగానే రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
వైసీపీ అధికార ప్రతినిధిగా.. ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా వ్యవహరించారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించినా.. జగన్ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. దీంతో అప్పటి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఎన్నికల అనంతరం.. వైసీపీ నుంచి బయటకు వచ్చిన పద్మ.. సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. జగన్ కారణంగానే అందరూ ఓడిపోయారని అన్నారు.
పార్టీని నడిపించడం.. నాయకులను సమన్వయం చేయడం కూడా రాదని పద్మ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఆమె.. అప్పటి నుంచి ఏ పార్టీలోనూ చేరకుండా మౌనంగా ఉన్నారు. సుమారు ఏడాదిన్నరగా మౌనంగా ఉన్న పద్మ.. తాజాగా టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్‌తో ఆమె భేటీ అయ్యారు. ఆయన పనితీరు, మంత్రి వర్గంలో వ్యవహరిస్తున్న తీరునుకొనియాడారు.
అయితే.. ఇప్పటికిప్పుడు వాసిరెడ్డి చేరికపై పార్టీలో ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పద్మకు అవకాశం దక్కుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పైగా వచ్చే ఎన్నికల నాటికి మహిళలకు ప్రాధాన్యం పెరుగుతున్న దరిమిలా వాసిరెడ్డికి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు కూడా మంచి అవకాశం చిక్కే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates