పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి… జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా పగ్గాలను బీజేపీ లాగేసుకున్న వైనాలతో ఆ రాష్ట్రం హెడ్ లైన్స్ లోకి ఎక్కగా… ఇప్పుడు అదే బీజేపీకి అదే రాష్ట్రం నుంచి డేంజర్ బెల్స్ వినిపించాయి. బీహార్ లోని బంకీపూర్ అసెంబ్లీ నుంచి జన సురాజ్ పార్టీ అదినేత, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విజయం సాదించడంతో బీజేపీపై పెను ప్రబావమే చూపనుందన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు బీజేపీకి పెద్ద ప్రమాదమేమీ లేకున్నా..సమీప భవిష్యత్తులో బంకీపూర్ ఉప ఎన్నిక బీజేపీకి తీరని నష్టం చేకూరుస్తాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఒక్క అసెంబ్లీ సీటులో బీజేపీ ఓడిపోతేనే ఈ తరహా విశ్లేషణలు అవసరమా? అంటే… ముమ్మాటికీ అవసరమనే చెప్పక తప్పదు. బీహార్ లోని బంకీపూర్ అసెంబ్లీ బీజేపీకి పెట్టని కోట కిందే లెక్క. 1995 నుంచి ఆ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా అక్కడి వారే. అంతేకాదండోయ్… బంకీపూర్ ఎమ్మెల్యేగా నితిన్ ఏకంగా ఆరు సార్లు ఎమ్మెట్యేగా గెలిచారు. 2006 దాకా పాట్నా వెస్ట్ గా పిలిచిన ఈ నియోజకవర్గం నుంచి నితిన్ 2006లో తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2010లో పాట్నా వెస్ట్ కాస్తా బంకీపూర్ గా మారగా… నితినే 2025దాకా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత బంకీపూర్ ఎమ్మెల్యే పదవికి నితిన్ రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారు. నితిన్ రాజీనామాతోనే ఇప్పుడు బంకీపూర్ కు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.

అంటే… బీజేపీ జాతీయ అధ్యక్షుడిని అందించిన బంకీపూర్ ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోయినట్టే కదా. అంతేకాకుండా 1995 నుంచి అక్కడ వేరే పార్టీ గెలిచిన దాఖలానే లేదు. 2005లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్ ఏకంగా 51 వేల భారీ మెజారిటీతో వరుసగా ఆరోసారి విజయం సాధించారు. ఇది జరిగి ఏడాది తిరక్కుండానే బంకీపూర్ బీజేపీ చేజారిపోయింది. బంకీపూర్ ఉప ఎన్నికలో బీజేపీ తరఫున బరిలోకి దిగిన నీరజ్ కుమార్…పీకే చేతిలో దాదాపుగా 20 వేల ఓట్లకు పైగా తేడాతో పరాజయం పాలయ్యారు. ఈ పరిస్థితి చూస్తుంటే… నిజంగానే బీజేపీకి ఈ ఉప ఉన్నిక డేంజర్ బెల్స్ మోగించినట్టేనని చెప్పక తప్పదు.

బంకీపూర్ ఉప ఎన్నికలో ఓటమి ఒక్కటే కాకున్నా.. ఇటీవలి కాలంలో వరుసబెట్టి చోటుచేసుకున్న పలు కీలక ఘటనలను బేరీజు వేసి చూస్తే… బీజేపీ గ్రాఫ్ కు ఇబ్బందికర పరిస్థితులు దాపురించినట్టేనన్న వాదనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పేపర్ లీక్ పై దేశ రాజధాని ఢిల్లీలో యువత నిరసనలు… అవి దేశవ్యాప్తంగా విస్తరించే దాకా బీజేపీ అధిష్ఠానం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం కూడా పార్టీకి ఇబ్బందిగానే మారిందని చెప్పాలి. ఇక రామ మందిర్ నిధుల గోల్ మాల్ వ్యవహారం కూడా బీజేపీని సంకటంలో పడేసిందనే చెప్పాలి. వీటి నుంచి పార్టీ తేరుకునేలోగానే బంకీపూర్ ఓటమి బీజేపీని మరింత కఠిన పరిస్థితుల్లోకి నెట్టేసిందని చెప్పక తప్పదు. త్వరలోనే జరగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వీటి ప్రభావం భారీగానే ఉండనుందన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.