కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే ఉత్తరం మూలన ఈ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ అదినేత, మాజీ సీఎం జగన్.. అంతిమ యాత్రలో పాల్గొన్నారు. తొలుత నివాళులర్పించిన ఆయన.. ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ముద్రగడ ఆశయాలను నెరవేర్చేందుకు తమ వంతు ప్రయత్నం కూడా చేస్తామన్నారు.
అనంతరం చేపట్టిన అంతిమ యాత్రలో(కొద్ది దూరం) ముద్రగడ పాడెను మోసిన జగన్.. ఆయన అంతిమ సంస్కారాన్ని దగ్గర ఉండి నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి.. వెళ్లిపోయారు. కుమారుడు గిరి తండ్రి పార్థివ దేహానికి నివాళులర్పించి.. అంత్యక్రియలు నిర్వహించారు. తుది కార్యక్రమాల్లో పలు జిల్లాల నుంచి కాపు నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అయితే.. ఇంటి ఆవరణలో వారంతా అడుగు పెడితే.. తొక్కిసలాట జరుగుతుందన్న ఉద్దేశంతో పోలీసులు వారిని నిలువరించారు.
ప్రభుత్వ లాంఛనాలపై ..
ఈ నేపథ్యంలో ఆయనకు అధికారిక లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. ఈ లాంఛనాలను వద్దని ముద్రగడ కుటుంబం స్పష్టం చేసింది. దీనిపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ముద్రగడ కుటుంబం నిర్ణయాన్ని సమర్థించగా.. మరికొంద రు మాత్రం.. అంతిమ సంస్కారాల విషయంలో రాజకీయాలు ఎందుకు..? అనే మాట అన్నారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు చాలా మంది సర్కారు లాంఛనాలపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. చివరకు వ్యక్తిగత లాంఛనాలతోనే కుటుంబం అంత్యక్రియలు నిర్వహించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates