ఇంత అహంకారమెందుకు అంబటి

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను కడసారి చూసుకునేందుకు వచ్చిన ఆయన కుమార్తె క్రాంతిని ఆయన అనుచరులు అడ్డుకున్నారు. ఆ సందర్భంగానే ఒకింత ఉద్రిక్త పరిస్థితి నెలకొంటే… సాయంత్రానికి ఆయన అంత్యక్రియల్లోనూ మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముద్రగడ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తలచగా… అందుకు ముద్రగడ అభిమానులు ససేమిరా అన్నారు. ముద్రగడ అభిమానుల కంటే కూడా అక్కడ చేరిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఓ రేంజి రచ్చకు తెర తీశారు.

తెలుగు నేల రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ అనారోగ్య కారణాలతో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో కన్నుమూయగా… బుధవారం ఉదయానికంతా ఆయన పార్ధీవ దేహాన్ని ఆయన సొంతూరు కిర్లంపూడికి తరలించారు. రెండు పర్యాయాలు ఉమ్మడి ఏపీకి మంత్రిగా పనిచేసిన ముద్రగడకు ఎవరు వద్దన్నా కూడా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగాల్సిందే. అయితే అంబటి రాంబాబు నేతృత్వంలోని కొందరు ముద్రగడకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు అవసరం లేదని తేల్చేశారు.

మరణించిన నేత ముఖ్యం గానీ… ఆ మరణించిన నేత తరఫున తామున్నామని, తాము చెప్పినట్టుగానే అంత్యక్రియలు జరగాలని అంబటి భీష్మించడం చూస్తుంటే… నిజంగానే ఆశ్చర్యం వేయక మానదు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఓ దఫా ఎంపీగా, రెండు పర్యాయాలు మంత్రిగా వ్యవహిరించిన ముద్రగడకు తప్పనిసరిగా అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహించాలి. అయితే అందుకు ససేమిరా అన్న అంబటి… ముద్రగడకు తుపాకులతో వందనం పలికేందుకు వచ్చిన పోలీసులపై పడిపోయారు. పోలీసుల చేతుల్లోని తుపాకులను కిందకు దించేలా చేశారు. పోలీసులను అక్కడి నుంచి తోసేశారు. 

ఈ సందర్భంగా అంబటి వ్యవహరించిన తీరును చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఓ ఆందోళనకారుడి మాదిరిగా అంబటి కిర్లంపూడిలో విశ్వరూపం ప్రదర్శించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటుగా పోలీసులను ఏకంగా తోసేశారు. అంబటి దూకుడును చూసిన ముద్రగడ అభిమానులు మరింతగా రెచ్చిపోయారు. ఫలితంగా అక్కడున్న పరిస్థితిని గమనించిన పోలీసులు.. ముద్రగడ అంత్యక్రియల్లో మరింత రచ్చ వద్దన్న భావనతో మౌనంగా వెనక్కెళ్లిపోయారు. వెరసి అదికారిక లాంఛనాలు లేకుండానే ముద్రగడ అంత్యక్రియలు ముగిశాయి.