ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ కూడా చేరిపోయారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై చౌకబారు వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నాగార్జునపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా నాగార్జున యాదవ్ కోసం హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లిన తెలంగాణ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని తెలంగాణకు తరలించారు.
వైసీపీలో యమా యాక్టివ్ గా కొనసాగుతున్న నాగార్జున యాదవ్… ఇటివలి కాలంలో ప్రతి విషయంపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ రాజకీయ ప్రత్యర్థులపై ఆయన ఓ రేంజిలో పేట్రేగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇదివరకే పలుమార్లు ఆయన అభాసుపాలయ్యారు కూడా.
అయినా ఏమాత్రం తగ్గని రీతిలో ఆయా అంశాలపై స్పందిస్తున్న యాదవ్… తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలోని సాక్షి ఛానల్ చర్చలో పాల్గొన్న సందర్భంగా రేవంత్ రెడ్డిపై చౌకబారు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కాగా… తెలంగాణ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
సాక్షి టీవీలో కేఎస్ఆర్ లైవ్ పేరిట జరిగే చర్చా కార్యక్రమంలో నాగార్జున యాదవ్ తరచూ కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా టెలికాస్ట్ అయిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రేవంత్ రెడ్డి ఓ జోమాటో డెలివరీ బాయి అంటూ యాదవ్ చౌకబారు వ్యాఖ్యలు చేశారు.
గతంలో తెలంగాణలో నమోదు అయిన ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన తీరును గుర్తు చేసిన యాదవ్… రేవంత్ సీఎం పదవికే కాదు ఎమ్మెల్యే పదవికి కూడా అనర్హుడు అని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని యాదవ్… సీఎం హోదాలో ఉన్న రేవంత్ ను వాడు, వీడు అంటూ సంబోధించారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత శ్రీనివాసరావు వారిస్తున్నా యాదవ్ ఆగలేదు. ఫలితంగా ఆయనపై కేసు, ఆ వెంటనే అరెస్టు వెంటవెంటనే జరిగిపోయాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates