బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ.. కీలకమైన బూత్ లెవిల్ కార్యకర్తలు జనసేనకు కొరవడ్డారు. ఆది నుంచి కూడా క్షేత్రస్థాయిలో బూత్ కమిటీల ఏర్పాటు, కార్యకర్తల నియామకంపై పార్టీ ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. దీంతో క్షేత్రస్థాయిలో డెవలప్ అయ్యేందుకు పార్టీకి ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
దీనికితోడు త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బూత్ స్థాయి కార్యకర్తల అవసరం పార్టీకి ఏర్పడింది. గత ఏడాది కాలంగా ఈ విషయంపై పార్టీలోనూ చర్చ సాగుతోంది. బూత్ లెవిల్ కమిటీలను ఏర్పాటు చేయాలని, కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించాలని పలువురు సీనియర్లు కోరుతున్నారు. అయితే.. ఎప్పటికప్పుడు ఈ విషయంపై అడుగులు ముందుకు పడడం లేదు.
మరోవైపు వచ్చే రెండు మాసాల్లో స్థానిక ఎన్నికలతోపాటు పంచాయతీ పోరు కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో నాయకుల కంటే కూడా బూత్ స్థాయి కార్యకర్తలకు పని ఎక్కువగా ఉంటుంది. ఓటు బ్యాంకును పెంచాలన్నా.. జెండా పట్టుకుని ఇంటింటికీ తిరగాలన్నా.. కూడా బూత్ లెవిల్ కార్యకర్తలు కీలకం. అందుకే తాజాగా ఈ వ్యవహారంపై జనసేన దృష్టిసారించిందని.. త్వరలోనే కమిటీలను ఏర్పాటు చేయనున్నామని సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు.
ఇతర పార్టీలను చూసుకుంటే.. టీడీపీ భారీ సంఖ్యలో బూత్ స్థాయికార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీగా నిలిచింది. దీని తర్వాత స్థానంలో వైసీపీ ఉండగా.. బీజేపీ కూడా ఇదేస్థాయిలో బూత్ కమిటీలను డెవలప్ చేసుకుంది. ఇక, పెద్దగా ఓటు బ్యాంకు లేని కమ్యూనిస్టులకు కూడా బూత్ స్థాయిలో కార్యకర్తలు ఉండడం గమనార్హం. అలానే.. కాంగ్రెస్ పార్టీలోనూ బూత్ లెవిల్ కార్యకర్తలు ఆశించిన స్థాయిలో ఉన్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ కూడా.. ఇప్పుడు బూత్ లెవిల్ కార్యకర్తల పై దృష్టిసారించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates