కొంచెం డివైడ్ టాక్ వచ్చినా సరే.. ‘చెన్నై లవ్ స్టోరీ’ తొలి వీకెండ్లో అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. సోమవారం వసూళ్లు తగ్గినా, సినిమా స్టడీగానే ఉంది. దాదాపుగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కు దెగ్గరగా వచ్చింది. ఇటు నిర్మాతలు హ్యాపీ, అటు బయ్యర్లూ సంతోషంగా ఉన్నారు.
ఐతే ఈ సినిమాకు సెకండాఫ్ మైనస్ అయిందనే విషయంలో భిన్నాభిప్రాయాలు లేవు. దాని మీద మరింత కసరత్తు చేసి ఉంటే, ఫస్టాఫ్ స్థాయిలోనూ సెకండాఫ్ కూడా ఉండుంటే.. మేకర్స్ చెప్పుకున్నట్లు అది కల్ట్ క్లాసిక్కే అయ్యేదేమో. ‘బేబి’ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసేదేమో. ఐతే ఈ సినిమాకు ఆల్టర్నేట్ సెకండాఫ్ గురించి ఒక దశలో చర్చ జరిగిందని, ఒకవేళ ఆ ఐడియాను అమలు చేసి ఉంటే, సినిమా వేరే లెవెల్లో ఉండేదేమో అంటున్నాడు దర్శకుడు రవి నంబూరి.
‘గుల్టే’ ఇంటర్వ్యూలో రవి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘చెన్నై లవ్ స్టోరీ’ నిర్మాత ఎస్కేఎన్ ప్రొడ్యూస్ చేయబోయే తర్వాతి చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్న అవినాష్.. ‘చెన్నై లవ్ స్టోరీ’కి ఆల్టర్నేట్ సెకండాఫ్ సూచించినట్లు తెలిపాడు. ఈ చిత్రంతో హీరో పాత్ర చనిపోయాక.. హీరోయిన్ కోసం ఆత్మ అయి తిరిగి వస్తుంది.
తీరని కోరికలు ఉన్న వాళ్లు ఇలా భూమి మీదికి మళ్లీ వచ్చి, ఆ కోరికలు తీరాక పైకి వెళ్లిపోతారనే పాత పాయింటునే ఇందులో చూపించారు. ఐతే ఇక్కడ ఆత్మకు కొంచెం లేటుగా ఈ విషయం అర్థమవుతుంది. ఆ సంగతి తెలిసినపుడు తాను తిరిగి వెళ్లిపోకుండా.. కథానాయికతో కలిసి భూమి మీద ఉండిపోవడం కోసం ఆ కోరికలు తీరకుండా హీరో ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది అనే ఐడియాను రవికి అవినాష్ ఇచ్చాడట.
తన పేరు స్క్రీన్ మీద కనిపించడం హీరో కోరికల్లో ఒకటి కాగా.. అది నెరవేరకుండా ఉండడం కోసం తన స్క్రిప్టు బయటపడకుండా చూడడం, తాను కథ అందించిన సినిమా స్క్రీనింగ్‌కు సిద్ధమైతే.. ప్రొజెక్షన్ ఆపేయడానికి ప్రయత్నించడం.. ఇలాంటి సన్నివేశాలు పెడితే ఎలా ఉంటుందనే చర్చ జరిగిందని.. ఆ ఐడియా తనకు భలే అనిపించిందని రవి నంబూరి తెలిపాడు.
కానీ అప్పటికే ‘చెన్నై లవ్ స్టోరీ’ షూట్ సగం అయిపోయిందని, మధ్యలో కథ మారిస్తే కష్టమని, సినిమా ఇంకో దారిలో వెళ్లిపోతుందేమో అనిపించి ఆ ఐడియాను ఎగ్జిక్యూట్ చేయలేదని.. కానీ అది క్రేజీ ఐడియానే అని రవి అన్నాడు. నిజంగా ఆ రకంగా కథ నడిచి ఉంటే.. ‘చెన్నై లవ్ స్టోరీ’ సెకండాఫ్‌పై ఇప్పుడు వస్తున్న విమర్శలు ఉండేవి కావేమో. సినిమా థ్రిల్లింగ్‌గా సాగి, ఇంకా పెద్ద రేంజికి వెళ్లేదేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates
