మీరు మూర్ఖులు… మీరే చేత‌గాని వాళ్లు: ద‌ద్ద‌రిల్లిన పార్ల‌మెంటు

పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు.. ప‌ట్టుమ‌ని ఒక్క‌గంట కూడా ప్ర‌శాంతంగా జ‌ర‌గ‌డం లేదు. స‌భ ప్రారంభం కాగానే అధికార‌, ప్ర‌తిప‌క్ష స‌భ్యుల మ‌ధ్య వాగ్వాదం.. ఎదురుదాడి, నినాదాలు, నిర‌స‌న‌ల‌తో హోరెత్తుతోంది. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం ఏకంగా ఒక‌రిపై ఒక‌రు దుర్భాష‌లు విసురుకునే ప‌రిస్థితి క‌నిపించింది. స‌భ ప్రారంభం కాగానే.. ఢిల్లీలో కాక్రోచ్ జ‌న‌తాపార్టీ కార్య‌క‌ర్త‌లు, విద్యార్థుల‌పై జ‌రిగిన లాఠీ చార్జి స‌హా.. పెల్లెట్ల‌ ప్ర‌యోగం, మ‌హిళా విద్యార్థుల‌పై జ‌రిపిన పోలీసుల దాడులు వంటివాటిని కాంగ్రెస్ ప్ర‌స్తావించింది.

అయితే.. స‌భ‌లో ఇటీవ‌ల ప్ర‌వేశ పెట్టిన ప‌రీక్ష పేప‌ర్ స‌వ‌ర‌ణ బిల్లుపై చ‌ర్చించాల‌ని అధికార ఎన్డీయే కూట‌మి స‌భ్యులు డిమాండ్ చేశారు. దీంతో స‌భ ప్రారంభ‌మైన ప‌ది నిమిషాల్లోనే ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ స‌మ‌యంలోనే స్పీక‌ర్ ఓం బిర్లా కాంగ్రెస్ అగ్ర‌నేత‌, లోక్‌స‌భ‌లో విప‌క్ష నాయ‌కుడు రాహుల్‌కు మాట్లాడే అవ‌కాశం ఇచ్చారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న “మూర్ఖులు వినిపించుకోరు“ అంటూ.. కేంద్ర మంత్రుల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి.

ఫ‌లితంగా ర‌చ్చ పెరుగుతోంద‌ని గ్ర‌హించిన రాహుల్‌.. “ఇది నామాట కాదు.. ఢిల్లీలో లాఠీ చార్జిలో గాయ‌ప డిన విద్యార్థులు చెబుతున్న మాట‌.“ అని వ్యాఖ్యానించారు. అయిన‌ప్ప‌టికీ.. బీజేపీ ఎంపీలు వెన‌క్కి త‌గ్గలేదు. రాహుల్ గాంధీ త‌న వ్యాఖ్య‌లు వెన‌క్కి తీసుకోవాల‌ని.. లేక‌పోతే.. చేత‌గాని వాళ్ల మాదిరిగానే వ్య‌వ‌హరిస్తార‌న్న ప్ర‌చారం చేస్తామ‌ని వ్యాఖ్యానించారు. ఈ గంద‌ర‌గోళం న‌డుమే రాహుల్ మరో వ్యాఖ్య చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోనే విద్యార్థుల‌పై లాఠీ చార్జి జ‌రిగింద‌ని ఆరోపించారు.

అందుకే షా.. స‌భ‌కు రాకుండా సిగ్గుతో త‌ల‌దించుకుంటున్నార‌ని అన్నారు. ఈ వ్యాఖ్య‌లు మ‌రింత దుమ్మరేపాయి. బీజేపీ కేంద్ర మంత్రికిరెణ్ రిజిజు స్పందిస్తూ.. రాహుల్ గాంధీ త‌క్ష‌ణ‌మే అమిత్ షాకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్నారు. త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ఆయ‌న కూడా డిమాండ్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు నీట్ పేప‌ర్ లీకేజీ కేసులో కీల‌క నిందితుల‌ను అరెస్టు చేశామ‌ని చెప్పారు. కానీ, దీనిని కూడా రాజ‌కీయం చేసుకునేందుకు `చేత‌గాని` కాంగ్రెస్ నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని రిజిజు అన్నారు. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య తీవ్ర వాగ్యుద్ధం చేసుకుంది. ఫ‌లితంగా స‌భ వాయిదా ప‌డింది.