వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారి కలయిక మీద ప్రేక్షకుల్లో ఓ రేంజులో హైప్ నెలకొంది. మాటల మాంత్రికుడు రచయితగా వీళ్ళ కాంబోలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వచ్చాయి కానీ డైరెక్టర్ పేరుతో మాత్రం ఇదే మొదటిది కావడం వల్ల అభిమానుల అంచనాలు ప్రత్యేకంగా ఉన్నాయి. అయితే పాత్రల పరిచయం పేరుతో వదులుతున్న వీడియో టీజర్ల మీద సోషల్ మీడియాలో డిబేట్లు, ట్రోల్స్ రెండూ జరుగుతున్నాయి. ఆదర్శ కుటుంబం ఏకే 47 మీద హైప్ అలా ఉంది మరి.
నిన్న వెంకటేష్ టీజర్ లో శ్రీనిధి శెట్టితో చెప్పించిన డైలాగులు అంత ఆకట్టుకునేలా లేవని నెటిజెన్లు వ్యక్తపరుస్తున్న అభిప్రాయం. అంత ఖరీదుగా కనిపించే ఇంట్లో వాషింగ్ మెషీన్ ఉంటే అదేదో గోల్డ్ మైన్ అన్న రేంజ్ లో ఆమె ఆశ్చర్యపోతూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ గురించి రకరకాల రియాక్షన్లు వచ్చాయి. పైగా త్రివిక్రమ్ అనిల్ రావిపూడి స్టయిల్ ని ఫాలో అయినట్టుగా అనిపించే కామెడీని జొప్పించే ప్రయత్నం అంత ఆర్గానిక్ గా అనిపించలేదనే కామెంట్స్ లేకపోలేదు.
తాజాగా వచ్చిన శ్రీనిధి శెట్టి ప్రోమో కూడా ఇదే బాటలో ఉంది. భార్య మీద జోకులు వేయడం, ఎదురింటి బాల్కనీలో నిలుచున్న నివేత పేతురాజ్ గురించి రఘుబాబుతో వెంకటేష్ పాజిటివ్ గా చెప్పడం లాంటివి పెద్ద కిక్ ఇచ్చేలా లేవు. క్యారెక్టర్ల పరిచయమే కనక ఇంత లోతుగా శల్యపరీక్ష చేయాల్సిన అవసరం లేదని అభిమానులు అంటున్నారు. కానీ ఒక క్రేజీ ప్రాజెక్టు ప్రమోషనల్ కంటెంట్ బయటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా రకరకాల అనాలిసిస్ లు జరుగుతాయి.
మిగిలిన ఇద్దరు పిల్లల వీడియోలు రేపు ఎల్లుండి వచ్చేస్తాయి. ఇవన్నీ ఎలా ఉన్నా టీజర్, ట్రైలర్ మీద అసలు భారం ఉంటుంది. కాకపోతే దానికి చాలా టైం ఉంది. అక్టోబర్ 2 సినిమా విడుదల కాబట్టి ఎలాంటి ఒత్తిడి లేకుండా పబ్లిసిటీని ఒక పద్ధతి ప్రకారం చేసేందుకు టీమ్ రెడీ అవుతోందట. వాయిదా ప్రసక్తే లేదు కాబట్టి ఏ టైంకి ఏమేం చేయాలనే దాని మీద చక్కని ప్రణాళిక సిద్ధంగా ఉందట. ముందైతే జనాల ఎగ్జైట్ మెంట్ పెరిగేలా సాలిడ్ కంటెంట్ వదలాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
