ఏపీ సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్ట్(RTGS) రాష్ట్రంలోని అన్ని వ్యవ స్థలను పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. తక్షణ ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరవేయడంలోనూ.. పాలనలోని లోటుపాట్లను తెలుసుకోవడంలోనూ ఆర్‌టీజీఎస్ కీలక రోల్ పోషిస్తోంది. అలాగే.. విపత్తులు సంభవించినప్పుడు ఎలా వ్యవహరించాలి? సీజన్ల వారీగా ఏం చేయాలి? ఎక్కడ ఏం జరుగుతోంది? సీసీ టీవీ మానిటరింగ్.. ఇతర వ్యవస్థల పనితీరు.. ఇలా అన్ని వ్యవస్థలను ఆర్‌టీజీఎస్ మానిటరింగ్ చేస్తోంది.
ఈ వ్యవస్థ దేశంలోనే తొలిసారి ఏపీలో 2024 నుంచి అమలవుతోంది. దీనివల్ల పాలన మరింత మెరుగ్గా ప్రజలకు చేరువ అవుతోంది. ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు.. అక్కడి ఐటీశాఖ అధికారులు ఏపీకి వచ్చారు. ఆర్‌టీజీఎస్ పనితీరు.. దీనిని తమ రాష్ట్రంలో ఎలా వినియోగించాలి.. దీని వల్ల ఒనగూరుతున్న ప్రయోజనాలను వారు తెలుసుకున్నారు.
అమరావతి లోని రాష్ట్ర సచివాలయం రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఐటీ శాఖ ఉన్నతాధికారుల బృందం సందర్శించింది. ఈ బృందానికి ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ ఆర్టీజీఎస్ పనితీరు గురించి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఆర్టీజీఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డేటా డ్రివన్ గవర్నెన్స్ ఆశయాల గురించి, డేటాలేక్, దానిద్వారా ఒనగూరుతున్న ప్రయోజనాల గురించి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
ప్రభుత్వంలోని 40 శాఖలను ఒకచోటకు తీసుకొచ్చి అతిపెద్ద డేటాలేక్ ను రూపొందించామన్నారు. కృత్రిమ మేథ(ఏఐ)ని వినియోగించుకుని డేటా ఆధారంగా పాలన మరింత సరళతరం చేస్తున్నట్టు వివరించారు. దీనివల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందేలా పలు రకాల యూస్ కేసెస్ రూపొందించామని తెలిపారు. ఇక, ఈ వ్యవస్థను రాజస్థాన్‌లో ఏర్పాటు చేసుకునేందుకు, శిక్షణ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం తో రాజస్థాన్ ఒప్పందం చేసుకోనుందని అధికారులు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
