ఎందుకొచ్చిన ట్వీట్లు జగన్?

సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మించిన వాళ్లు లేరని అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. ఆయన ప్రెస్ మీట్ పెట్టినా, ఏదైనా కార్యక్రమానికి హాజరైనా.. ట్రోల్ అయ్యేలా ఏదో ఒక కామెంట్ చేయడం మామూలే. ఆయన పెట్టే సోషల్ మీడియా పోస్టులు కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. తాజాగా ఆయన భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో ఒక లెంగ్తీ ట్వీట్ వేశారు. ‘‘పని వైఎస్సార్సీపీది.. ప్రచారం చంద్రబాబుది. క్రెడిట్ వితౌత్ కంట్రిబ్యూషన్-అదే చంద్రబాబు రాజకీయం’’ అంటూ.. భోగాపురం ఎయిర్ పోర్టు క్రెడిట్ అంటూ తమ ప్రభుత్వానిదే అని, కానీ చంద్రబాబు ఏమీ చేయకుండా క్రెడిట్ తీసుకుంటున్నారని జగన్ ఇందులో సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు. 

కానీ భోగాపురం ఎయిర్ పోర్టుకు పునాది పడింది 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు కాగా.. దాదాపు 80 శాతం నిర్మాణం శాతం పనులు జరిగింది, ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వచ్చింది ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలోనే. అలా అని జగన్ కంట్రిబ్యూషన్ ఏమీ లేదని చెప్పడానికి లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కొంతమేర నిర్మాణ పనులు జరిగాయి. కానీ వాటి శాతం తక్కువ.

ఇక్కడ ప్రస్తావించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భోగాపురం ఎయిర్ పోర్టు పనులు ఆలస్యం కావడానికి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగనే ముఖ్య కారణం. ఆయన ఎయిర్ పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. ‘‘ఎర్రబస్సు కూడా రాని చోటికి ఎయిర్ బస్సులు ఎందుకు’’ అనే కామెంట్ చేయడమే కాదు.. తాము అధికారంలోకి రాగానే ఎయిర్ పోర్టు ప్రతిపాదనను రద్దు చేయడమే కాక, సేకరించిన భూమూలన్నీ వెనక్కి ఇచ్చేస్తామని కూడా ప్రకటించారు. ఇప్పుడు జగన్ ట్వీట్ కింద.. సంబంధిత వీడియోలు పెట్టి ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. 

జగన్ అధికారంలోకి వచ్చాక అంతకుముందు కేటాయించిన భూముల్లో 500 ఎకరాలు వెనక్కి తీసుకోవడం, కమిషన్ల కోసం కాంట్రాక్టర్‌ను మార్చడం, చాలా ఆలస్యంగా పనులు మొదలుపెట్టి, అనుకున్నంత వేగంగా నిర్మాణాలు చేపట్టకపోవడం లాంటి విషయాలనూ టీడీపీ, జనసేన మద్దతుదారు ప్రస్తావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం శరవేగంగా నిర్మాణాలను పూర్తి చేసి ఎయిర్ పోర్టును అందుబాటులోకి తెస్తే.. ఇప్పుడు భోగాపురం క్రెడిట్ అంతా తమ ప్రభుత్వానిదే అని చెప్పుకోవడం కామెడీగా ఉందని.. ఇలాంటి ట్వీట్ల వల్ల మరింత ట్రోలింగ్ ఎదుర్కోవడం తప్ప ప్రయోజనం ఏమీ లేదని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ట్వీట్ కింద వెళ్లి కోట్స్, కామెంట్లు చూస్తే ఆయన ఎంతగా అభాసుపాలవుతున్నారో అర్థమవుతుంది.