ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర రాజధాని పై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి శాశ్వతంగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే.. రాజధాని అంటే.. కేవలం 29 గ్రామాలు మాత్రమే కాదని ఆయన పేర్కొన్నారు. విజయవాడ, గుంటూరు కూడా దీనిలో భాగమేనని తెలిపారు. అదేసమయంలో మచిలీపట్నం కూడా దీనిలో భాగంగా ఉంటుందని పేర్కొన్నారు. కేవలం 29 గ్రామాలకు మాత్రమే పరిమితం అయ్యేలా రాజధానిని నిర్మించడం లేదని తెలిపారు. తొలుత అలా అనుకున్నా.. దానిని మార్పు చేశామని ఆయన పేర్కొన్నారు.
రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ(సీఆర్ డీఏ)పై మంగళవారం సాయంత్రం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాజధాని వ్యవహారంపై వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని నాయకులు, ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఉన్నతాధికారులు కూడా ఖండించా లని ఆయన సూచించారు. ప్రభుత్వం అంటే.. అధికారులు కూడా ఉంటారని.. విధానపరమైన సమస్యలు, విమర్శలు వచ్చిన ప్పుడు.. ఉన్నతాధికారులు కూడా మీడియా ముందుకు రావాలని చంద్రబాబు సూచించారు. అన్నీ మంత్రులు, ఎమ్మెల్యేలే చూడాల్సిన అవసరం లేదన్నారు.
ఈ సందర్భంగా గతంలో ఉన్నతాధికారులు మీడియా ముందుకు వచ్చేవారని.. విధాన పరమైన విషయాలపై వారు వివరణ కూడా ఇచ్చేవారని చంద్రబాబు తెలిపారు. కానీ, ప్రస్తుతం ఐఏఎస్‌లు.. కేవలం కార్యాలయాలకు మాత్రమే పరిమితం అవుతున్నారని.. ఇది సరైన విధానం కాదన్నారు.. రాజధాని వంటి కీలక అంశాలు తెరమీదికి వచ్చినప్పుడు ఆధారాలు, వాస్తవాలతో అధికారులు మీడియాకు వివరిస్తే.. ప్రజలకు ఏం జరుగుతోందో తెలుస్తుందని తెలిపారు. రాజకీయంగా మీరు ఏమీ మాట్లాడాల్సి న అవసరం లేదన్నారు. అది తాము చూసుకుంటామన్నారు. ఇక, నుంచి సీఆర్ డీఏలో అధికార ప్రతినిధులను ఏర్పాటు చేసి మీడియా ముందుకు రావాలని ఆయన సూచించారు.
నేను సైతం..
రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పనులను తానే స్వయంగాపరిశీలిస్తానని చంద్రబాబు చెప్పారు. ఇప్పటి వరకు మంత్రి నారాయణ మాత్రమే నిత్యం రాజధానిలో పర్యటిస్తున్నారని.. ఇక నుంచి తాను కూడా వారానికి మూడు రోజులు అమరావతిలో పర్యటించి పనులను పరిశీలిస్తానన్నారు. తద్వారా త్వరిత గతిన పనులు పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. అధికారులు కూడా సాయంత్రం, ఉదయం వేళల్లో పనులు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లాలన్నారు. దీంతో కాంట్రాక్టు సంస్థలు మరింత బాధ్యతతో పనిచేస్తాయన్నారు. రాజధాని విషయంపై వస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టే బాధ్యతను ఉన్నతాధికారులు కూడా తీసుకోవాలన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
