జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు.. నగరాలు, పట్టణాల్లో ఎంత ఇమేజ్ ఉందో.. గిరిజన ప్రాంతాల్లోనూ అంతే ఇమేజ్ ఉంది. సినిమా పరంగా పక్కన పెడితే.. పాలన పరంగా, ఉప ముఖ్యమంత్రిగా ఆయన వేసిన అడుగులు గిరిజనులకు చేరువ అయ్యాయి. పాడేరు, అరకు, మన్యం వంటి కీలక గిరిజన ప్రాంతాల్లో పవన్ కల్యాణ్‌కు ఇటీవల కాలంలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా యూత్ పెద్ద ఎత్తున జనసేనకు కనెక్ట్ అవుతున్నారు.
ఇది ఓటు బ్యాంకుగా మారితే.. ఇక, సేనకు తిరుగు ఉండదన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాలే లక్ష్యంగా జనసేన వ్యూహాత్మక కార్యాచరణకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది నుంచి గిరిజన ప్రాంతాల్లోనే ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహించేలా పార్టీ పరంగా కార్యాచరణను రూపొందిస్తున్నారు. దీనికి రెండు రకాల వ్యూహాలను పార్టీ రెడీ చేస్తోంది. 1) ఓటు బ్యాంకును పెంచుకోవడం. 2) వైసీపీని మరింత డైల్యూట్ చేయడం.
ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులకు.. రాష్ట్ర పంచాయతీ రాజ్(పవన్ కల్యాణ్ మంత్రిగా ఉన్న శాఖ) నుంచి కూడా నిధులు కేటాయించి అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇదేసమయంలో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా రహదారి సౌకర్యం లేని గిరిజన ప్రాంతాల్లో రహదారులు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ సౌకర్యంలేని చోట్ల విద్యుత్ ఇస్తున్నారు. ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇవన్నీ ఓటు బ్యాంకుగా మారేలా.. జనసేన కార్యాచరణ రూపొందిస్తోంది. ఆయా ప్రాంతాల్లో వారానికి రెండు రోజుల పాటు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ పర్యటించే ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా పనులు పుంజుకోవడంతోపాటు.. ప్రజల్లో సానుకూలత పెరుగుతుంది. ఒక్కసారి గిరిజన ఓటు బ్యాంకు దక్కితే.. అది వెనక్కి మళ్లే ప్రశ్నే అరుదుగా ఉంటుంది. తద్వారా జనసేన గిరిజన నియోజకవర్గాలలో బలపడడం ఖాయమన్నది ఒక అంచనా. ఇదేసమయంలో వైసీపీకి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆ పార్టీని తిప్పికొట్టవచ్చన్న వ్యూహం కూడా ఉండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates