వైసీపీ అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో ఆయన వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. తాజాగా పార్టీ నాయకులతో ఆయన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జగన్ శ్రీకాకుళం పర్యటన విషయం వారి మధ్య చర్చకు వచ్చింది. ఈ రోజు జగన్ శ్రీకాకుళం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ప్రస్తుతం జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజును ఆయన పరామర్శించనున్నారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన కుమారుడు చేసిన తప్పును ఇతరులపైకి నెట్టేసి.. వేరొకరి జీవితాన్ని బలి చేయాలని అనుకున్న సీదిరి అప్పలరాజును పరామర్శించి.. జగన్ ఎలాంటి సందేశం ఇవ్వనున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఒకరి జీవితాన్ని బలి చేసే హక్కు సీదిరికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. గౌరవంగా తన కుమారుడిని చట్టానికి అప్పగించి తప్పు ఒప్పుకొంటే.. న్యాయవ్యవస్థ ముందు పరువు నిలబడిఉండేదని వ్యాఖ్యానించారు. కానీ, తన కుమారుడిని తప్పించే క్రమంలో వేరేవారిని కేసులో ఇరికించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయ్యాడని అన్నారు. ఇలాంటి వారికి జగన్ పరామర్శలు చేసి.. సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని అన్నారు.
ఇక, గుంటూరు జిల్లా పర్యటన సమయంలో జగన్ కారు కింద నలిగిపోయి.. చనిపోయిన వ్యక్తి గురించి కూడా చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. అప్పట్లో కనీసం బాధితుడిని ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేదని, దీంతో అతను చనిపోయాడన్నారు. ఆ కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకుని పరామర్శించాడని ఎద్దేవా చేశారు. పుట్టిన రోజునెపంతో జంతు బలులను ప్రోత్సహించిన వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ చనిపోతే.. అతిని చావుకు కూటమి ప్రభుత్వం కారణమని ప్రచారం చేశారని.. కానీ, సీసీటీవీ ఫుటేజీలతో వాస్తవాలను వెల్లడించామన్నారు.
ఈ సందర్భంగా ఓ నేత.. జగన్ నీచాలపై సినిమా తీస్తే.. అని కామెంట్ చేసే సరికి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి తీసినన బాహుబలి మాదిరిగా.. రెండు పార్టులుగా తీయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. 1) కుటుంబానికి, తల్లికి, చెల్లికి, బాబాయికి చేసిన అన్యాయం. 2) రాష్ట్రంలో రాక్షసత్వాన్ని ప్రోత్సహిస్తున్న తీరును.. కూడా చూపించాలన్నారు. అప్పుడు ప్రజలే మరింత బుద్ధి చెబుతారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నాయకులు ఘొల్లున నవ్వారు. అయితే.. అలాంటి వాటిని టీడీపీ ప్రోత్సహించదని.. సినిమాల ద్వారా కాకుండా.. ప్రజల మధ్యకు నాయకులు వెళ్లి జగన్ నీచాన్ని ప్రచారం చేయాలని సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
