అమరావతిపై అక్కసు తగ్గదా జగన్?

అంతా గందరగోళం.. అమరావతిపై అదే అక్కసు.. దాదాపు పదేళ్లుగా నిలకడ లేని విధానం.. స్పష్టతలేని ప్రకటనలు.. ప్రజలను గందరగోళంలోకి నెట్టడం.. తద్వారా రాజకీయ లబ్ధిని పొందాలని ప్రయత్నించడం.. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న చదరంగంలో అమరావతి రైతులు పావులుగా మారుతున్నారు. అధికారం కోల్పోయి దాదాపు 18 నెలల పాటు ప్రెస్‌మీట్లకే పరిమితమైన వైఎస్ జగన్, ఏడాది తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపడతానని చెబుతున్నారు.

ఈలోగా అమరావతి రాజధానిపై మరోసారి వివాదానికి తెర తీశారు. గతంలో అమరావతిని ఎడారి అన్నారు.. స్మశానం అన్నారు.. ఆ తర్వాత మూడు రాజధానులే తమ పార్టీ విధానమంటూ ఎన్నికలకు వెళ్లారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు ‘మావిగన్’ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. మొత్తం మీద రాష్ట్ర ప్రజలను, అమరావతి రైతులను ప్రతిసారి గందరగోళంలోకి నెట్టేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

‘వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి’ అంటూ జగన్ ప్రకటించారు. మావిగన్‌కు మేం కట్టుబడి ఉన్నాం. మావిగన్ అజెండాతోనే ఎన్నికలకు వెళ్తాం. ప్రజల మద్దతు ఎవరికి ఉందో చూసుకుందాం. మావిగన్ మా నినాదం.. మాకు మద్దతు ఇచ్చేవాళ్లు ఓటేస్తారు. ఎన్నికల్లో అమరావతా.. మావిగనా.. ప్రజలే తేల్చాలని సంచలన ప్రకటన చేశారు. మొత్తానికి, వచ్చే ఎన్నికల్లో ‘మావిగన్’నే తమ ప్రధాన ఎన్నికల అజెండాగా వైసీపీ ముందుకు తీసుకెళ్లనున్నట్లు జగన్ స్పష్టం చేశారు.

ఒకే అంశంపై ఒక రాజకీయ పార్టీ ఇన్ని విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోవడం బహుశా వైసీపీకే చెల్లుతుందేమో. ఏదైతే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా అమరావతి రాజధాని రూపుదిద్దుకుంటుందో.. దానికి వ్యతిరేకంగా స్థానికులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ మావిగన్ ప్రచారం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. తమకు అన్యాయం జరిగిందని కొంతమంది రైతులు తనను కలిశారని చెబుతున్న జగన్, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రైతులు, మహిళల ఉద్యమంపైఎలా ఉక్కుపాదం మోపారో గుర్తుంచుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు.

అమరావతి రాజధానిపై పార్లమెంటులో చట్టం కూడా చేశారు. అయినా జగన్ ‘మావిగన్’ అనే నినాదాన్ని అందుకోవడం వెనుక పెద్ద అజెండా దాగి ఉందని రాజకీయవేత్తలు అంచనా వేస్తున్నారు. అమరావతి రాజధానిని సమ్మతించకుండా ఇటువంటి విరుద్ధమైన ప్రకటనలు చేయడం పక్కనున్న రాష్ట్రాల నేతలకు కూడా చులకన భావం కలిగే విధంగా ఉంటుందని విశ్లేషకుల భావన. అయినా జగన్ తాను ఎన్నికలకు మావిగన్ అనే నినాదంతో వెళ్తానని చెప్పడం వెనుక అంతర్యం ఏమిటో ముందు ముందు తెలుస్తుంది.