తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి సెటైర్లు వేశారు. ఈ సారి జాతీయ స్థాయిలో రేవంత్ పై కేటీఆర్ విమర్శలు చేశారు. తనను తిట్టాలనుకుంటే తిట్టొచ్చని, కానీ, రేవంత్ రెడ్డి అని మాత్రం పిలవొద్దని కేటీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఏబీపీ వార్తా సంస్థ నిర్వహించిన ‘ది సదరన్ రైజింగ్ సమ్మిట్-2026’లో పాల్గొన్న సందర్భంగా కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు. పొరపాటున కేటీఆర్ ను రేవంత్ జీ అని మహిళా జర్నలిస్ట్ సంబోధించగా…ఆయన ఈ రకంగా సెటైర్లు వేశారు.
తనను రేవంత్ అని సంబోధించి అవమానించారని, తాను ఇక్కడ ఉండలేనని, ఇక్కడి నుంచి వెళ్లక తప్పదని సరదాగా వ్యాఖ్యానిస్తూ కేటీఆర్ సమ్మిట్ లో నవ్వులు పూయించారు. తనను తిట్టాలని అనపిస్తే నేరుగా తిట్టాలని, రేవంత్ అని ఎందుకు పిలుస్తున్నారని కేటీఆర్ సెటైర్లు వేయడంతో సభికులంతా నవ్వుకున్నారు.
అయితే, రేవంత్ అని పిలవడాన్ని తిట్టు అని ఎందుకు అనుకుంటున్నారని, రేవంత్ ను ఎందుకు ఇంత ద్వేషిస్తున్నారని కేటీఆర్ ను ఆమె అడిగారు. ద్వేషం కాదని, తెలంగాణలో ఎవరి దగ్గరుకు వెళ్లి రేవంత్ పేరు చెబితే తిడతారని అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు రేవంత్ రెడ్డి బాడీగార్డ్ లా వ్యవహరిస్తున్నారని చురకలంటించారు. రేవంత్ రెడ్డి చిన్న మోదీ అని, పెద్ద మోదీలాగే ఈయన కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు.
‘‘అమిత్ షా హో…యా కోయీ ఔర్ షా హో…తెలంగాణకా బాద్ షా హై కేసీఆర్…హీ విల్ కమ్ బ్యాక్ ఇన్ 2028..మార్క్ మై వర్డ్స్’’ అని కేటీఆర్ చెప్పిన మాస్ డైలాగ్ బీఆర్ఎస్ కేడర్ కు కిక్కిచ్చింది. అయితే, ఇటువంటి డైలాగులు వినేందుకు బాగుంటాయని, బాద్ షా అయినా సరే గత ఎన్నికల్లో మీరు ఓడిపోయారు కదా అని ఆ మహిళా జర్నలిస్ట్ ప్రశ్నించారు. అయితే, అప్పుడప్పుడు ఎంత పెద్ద రాజైనా రెండడుగులు వెనక్కి వేయాల్సి వస్తుందని మరో పంచ్ డైలాగ్ కొట్టారు.
అవినీతి, ఓట్ చోరీ, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా వంటి విషయాలపై ప్రధాని మోదీ, అమిత్ షాలను ప్రతిపక్షాలు, యువత ప్రశ్నిస్తున్నాయని, కానీ, సమాధానం చెప్పే తీరిక ఆ ఇద్దరికీ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ బలపడడం లేదని, అక్కడ బీజేపీకి స్థానం లేదని అన్నారు. వాస్తవానికి గతంలో ఎన్నడూ లేని విధంగా 14 ఏళ్లుగా తెలంగాణలో బీజేపీ బలహీనపడుతోందని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates