చంద్రబాబు పవన్ పై మాట పడనివ్వరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన సంగతి తెలిసిందే. ఈ విషయం మంగళవారం నాటి ఏపీ కేబినెట్ లో ప్రస్తావన రాగా… పవన్ కు మంత్రులంతా అండగా నిలవాలని టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ విషయంలో మంత్రులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని కూడా చంద్రబాబు సూచించారు. ఫలానా అంశంతో తనకు సంబంధం లేదన్నట్లుగా మంత్రులు వ్యవహరించడానికి వీల్లేదని ఆయన దిశానిర్దేశం చేశారు.

మంగళవారం అమరావతిలో చంద్రబాబు ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులంతా హాజరు కాగా.. పలు కీలక విషయాలపై కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ లో నిర్దేశిత ఎజెండా ముగిసిన తర్వాత రాజకీయ అంశాలతో పాటు ఇతరత్రా నాన్ ఎజెండా అంశాలపైనా చర్చ జరిగంది. ఈ సందర్భంగా విజయవాడలో కాపు యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం, దానిపై వైసీపీ చేస్తున్న రచ్చ, ఆ ఘటన నేపథ్యంగా పవన్ కామెంట్లు, వాటిపై వైసీపీ మార్కు కౌంటర్లపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా కేబినెట్ లోని మంత్రులందరికీ చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. విపక్ష వైసీపీ ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా ధోరణిని వైసీపీ వీడాలంటే మంత్రులంతా ఉమ్మడిగా వైసీపీకి కౌంటర్లు ఇవ్వాల్సిందేనని సూచించారు. అంతేకాకుండా మంత్రులు తమ శాఖకు సంబంధించని విషయాలపై అంతగా ఆసక్తి చూపడం లేదన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తమది కాని శాఖపై విపక్ష వైసీపీ విమర్శలు గుప్పిస్తే తామెందుకు స్పందించాలని కొందరు మంత్రులు భావిస్తున్నారన్న చంద్రబాబు… ఆ తరహా వైఖరిని మంత్రులు వీడాలని సూచించారు.

ఒకే అంశంపై విపక్షం పదే పదే విరుచుకుపడుతూ… దానిని ప్రజల్లోకి తీసుకెళుతున్న వైనాన్ని మంత్రులంతా గమనించాలని చంద్రబాబు సూచించారు. కేవలం గమనింపుతోనే ఆగిపోకుండా.. విపక్ష వైసీపీని ఆయా అంశాల్లో నిలువరించేలా వ్యవహరించాలని కోరారు. తమకు కేటాయించిన శాఖల మీదే కాకుడా ప్రతి అంశంపైనా మంత్రులకు అవగాహన ఉండాల్సిందేనని, ఆ దిశగా మంత్రులంతా యాక్టివ్ మోడ్ లోకి రావాల్సి ఉందన్నారు. ఇప్పటిదాకా మంత్రుల్లో చాలా మంది అనుసరిస్తున్న డిఫెన్స్ మోడ్ ను వదిలేసి… అఫెన్సివ్ మోడ్ లోకి రావాలని ఆయన దిశానిర్దేశం చేశారు.