విజయవాడ యువకుడు సాయికృష్ణ మిస్టరీ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన స్పందించారు. రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ నేతృత్వంలో ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. అంతేకాదు.. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని కూడా ఆదేశించారు. ఒక ప్రభుత్వంగా ఎంత వరకు స్పందించాలో.. అంతవరకు ముఖ్యమంత్రి స్పందించారు.
అయితే.. ఈ వ్యవహారంపై స్పందించిన వైసీపీ నేత, మాజీ సీఎం జగన్.. వెంటనే సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. సరే.. దీనిని కూడా అర్ధం చేసుకోవచ్చు. ప్రతిపక్ష నాయకుడిగా.. ఆయన ఈ డిమాండ్ చేయొచ్చు. ఆయనకు ఉన్న పరిధిలో ఆయన రాజకీయంగా దీనిని వినియోగించుకుంటున్నారన్న విమర్శలను పక్కన పెట్టినా.. ప్రతిపక్ష నేతగా ఆయన ఈ డిమాండ్ చేశారని అనుకుందాం.
కానీ.. తన సొంత బాబాయి వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైనప్పుడు.. ముందు ఒక మాట.. తర్వాత మరో మాట మార్చడం.. ఇప్పుడున్న స్పీడ్.. ఆనాడు కనబరచకపోవడమే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఇదొక్కటే కాదు.. నాడు వైసీపీ ఎమ్మెల్యే అనంతబాబు.. డ్రైవర్(దళిత సామాజిక వర్గం) సుబ్రహ్మణ్యంను దారుణంగా హతమార్చి.. శవాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు.. ఇదే టీడీపీ నాడు సీబీఐకి ఇవ్వమంటే.. వ్యంగ్యాస్త్రాలు రువ్వలేదా? అనేది ప్రశ్న.
ప్రస్తుత కేసును ఎవరూ తేలికగా తీసుకోమని కానీ.. కేసును నీరుగార్చమని కానీ.. కోరుకోవడం లేదు. కానీ.. అధికారంలో ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా వ్యవహరించడమే ఇప్పుడు జగన్ పై విమర్శలు వచ్చేలా చేస్తోంది. నాడు కూడా ఇంత సచ్ఛీలంగా వ్యవహరించి.. బాధితుల పక్షాన నిలబడి ఉంటే.. ఆయన నిజాయితీని.. ప్రజాసేవను ఎవరూ శంకించేవారు కాదు. కానీ.. తనకు ఇబ్బంది వచ్చినప్పుడు.. తన పార్టీ మైలేజీ తగ్గుతోందని భావించినప్పుడు మాత్రమే సీబీఐ గుర్తుకు రావడమే ఇప్పుడు చర్చనీయాంశం. ఈ విషయంలో జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates