విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ సాయికృష్ణ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై సస్పెన్షన్ వేటు పడింది. నాగరాజుపై కేసు కూడా నమోదైంది. ఈ రోజు ఆయనను అరెస్టు చేసే అవకాశముంది. అయితే, సాయికృష్ణ కుటుంబ సభ్యులను నిన్న పరామర్శించిన ఏపీ మాజీ సీఎం జగన్…ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబును సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిశారు. వారిని చంద్రబాబు తన కార్యాలయానికి పిలిపించుకొని భరోసానిచ్చారు. సాయికృష్ణ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చంద్రబాబు చెప్పారు. అంతేకాదు, సాయికృష్ణ అదృశ్యంపై ఉన్నతస్థాయి విచారణ జరుపుతున్నామని, తప్పుచేసినవారు ఎంతటివారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు.
ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వానికి సాయికృష్ణ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తమకు అండగా నిలిచిన రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు చెప్పారు. సాయికృష్ణ అదృశ్యం అంశంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపారని, ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates