శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా మెగా డీఎస్సీలో అవకతవకలంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై శాసనమండలిలో వాడీవేడీ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అ వ్యవహారంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే శాసనసభలో ఆ విషయంపై చర్చకు సిద్ధమని, జగన్ సభకు హాజరు కావాలని టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ స్పందించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, లోకేశ్ లపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘చదువు చెప్పే వారికి పరీక్ష పెట్టకుండా ఉద్యోగాలిస్తారా? చంద్రబాబు, లోకేశ్ ల మైండ్ లో చిప్ ఉందా? లేదా?’’ అని జగన్ ప్రశ్నించిన వైనం షాకింగ్ గా మారింది. ఇక, బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండా తండ్రీకొడుకులు చట్టసభలలో బ్యాటింగ్ చేస్తున్నారని చంద్రబాబు, లోకేష్ ను ఉద్దేశించి జగన్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే శాసనసభలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇవ్వాల్సి వస్తుందని, అందుకే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని జగన్ ఆరోపించారు.
డీఎస్సీలో అక్రమాలు జరిగాయని స్పష్టంగా కనిపిస్తోందని, ఆ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని జగన్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో డీఎస్సీ గురించి మాట్లాడతారని, కానీ మండలిలో మాట్లాడరని విమర్శించారు. డీఎస్సీలో అవకతవకలపై ప్రశ్నిస్తున్నామన్న అక్కసుతోనే తమ హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షపై ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని జగన్ ఆరోపించారు. డీఎస్సీ పేపర్ తయారీ, పరీక్ష నిర్వహణ ఒకే అధికారి చేతిలో పెట్టారని, స్వయంగా ఆ విషయాన్ని లోకేష్ అంగీకరించారని గుర్తు చేశారు. ఇలా ఒకే అధికారి చేతికి రెండు బాధ్యతలు అప్పజెప్పిన చరిత్ర గతంలో లేదని అన్నారు.
తమకు నచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకునేందుకే స్పోర్ట్స్ కోటాను వాడుకున్నారని జగన్ ఆరోపించారు. డీఎస్సీ రాయకుండానే 372 మందికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఎలా ఇస్తారని జగన్ ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా జీవోలు జారీ చేశారని, రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఆ జీవోలను వెనక్కి తీసుకున్నారని అన్నారు. డీఎస్సీలో స్కామ్ జరిగింది అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని జగన్ ప్రశ్నించారు. పీవీ సింధు లాగా ఎంతమంది అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొని పథకాలు సాధించారని జగన్ ప్రశ్నించారు. పీవీ సింధు వంటి క్రీడాకారులకు ఉద్యోగం ఇవ్వడాన్ని ఎవరూ తప్పుబట్టరని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates