పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని ప్రయత్నిస్తే ఎంతటి విపరిణామాలు తలెత్తుతాయో చెప్పే హృదయ విదారక ఘటన విశాఖపట్నంలో జరిగింది. ఒక ప్రైవేటు స్కూలులో ఉపాధ్యాయురాలి కఠిన వైఖరి ఒక చిన్నారి ప్రాణాన్ని బలిగొంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ జనాలను కదిలించేస్తోంది.
ఆరేళ్ల ప్రణయ్ తేజ అనే అబ్బాయి ఒక ప్రైవేటు స్కూల్లో చదువుకుంటున్నాడు. గురువారం స్కూలుకు వచ్చిన ఆ పిల్లాడిని హోం వర్క్ గురించి టీచర్ అడిగింది. ఐతే తనను పిలుస్తున్నపుడే పిల్లాడు బాగా భయపడడం కనిపించింది. ఐతే ఉపాధ్యాయురాలు.. హోం వర్క్ చేయనందుకు ఆ పిల్లాడి పట్ల చాలా కఠినంగా వ్యవహరించింది. అతణ్ని భయపెట్టడం కోసమో ఏమో.. ప్రణయ్ బట్టలు విప్పడం మొదలుపెట్టింది.
దీంతో పిల్లాడు వద్దు వద్దు అంటూ చేయి ఊపుతూ.. గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. అయినా ఊరుకోని టీచర్.. ఆ పిల్లాడి చెంప మీద ఒక దెబ్బ కొట్టింది. ఆ వెంటనే పిల్లాడు స్పహ తప్పి టీచర్ మీదికి పడిపోయాడు. టీచర్ కంగారు పడి ఆ పిల్లాడిని లేపి స్కూల్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చింది. పిల్లాడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రణయ్ మరణంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదించారు. తర్వాత అతడి మరణానికి ఉపాధ్యాయురాలే కారణమంటూ స్కూల్ ముందు ఆందోళనకు దిగారు.
టీచర్ బట్టలు విప్పే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత చెంపదెబ్బ కొట్టడంతో భయకంపితుడైన పిల్లాడు.. గుండెపోటుకు గురై ఉంటాడని భావిస్తున్నారు. ప్రణయ్‌కి ముందే ఆరోగ్య సమస్యలు ఉండి ఉంటాయా అనే చర్చ కూడా జరుగుతోంది. కానీ పిల్లల పట్ల స్కూళ్లలో ఉపాధ్యాయులతో పాటు ఇళ్లలో తల్లిదండ్రులు కూడా ఎంత అప్రమత్తంగా వ్యవహరించాలి అనడానికి ఈ ఉదంతం ఉదాహరణగా నిలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates