‘రాహుల్ గాంధీ పెద్ద జోక్’

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఘన విజయం సాధించడంతో ఆ పార్టీకి కాంగ్రెస్ మద్దతునిచ్చింది. దీంతో, డీఎంకే, కాంగ్రెస్ ల మధ్య బంధం తెగిపోయింది. ఇండీ కూటమి నుంచి కూడా డీఎంకే బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి కాంగ్రెస్, డీఎంకేల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా అది పీక్స్ కు చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ పెద్ద జోకర్ అంటూ డీఎంకే ఐటీ వింగ్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రాజకీయ అస్తిత్వం కోసం కాంగ్రెస్ పోరాడుతున్న సమయంలో తమ భుజాలపై ఆ పార్టీని మోశామని, అయినా సరే కాంగ్రెస్ పార్టీ తమను వెన్నుపోటు పొడిచిందని డీఎంకే విమర్శించింది. కొత్త బొమ్మ ఒకటి రాగానే వారు తమకు హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారని అసంతృప్తి వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ ఒక పెద్ద జోక్ అంటూ డీఎంకే ఐటీ వింగ్ తన ఎక్స్ ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. దాంతోపాటు డీఎంకే అధికార పత్రిక మురసోలి తన సంపాదకీయంలో రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించింది.

ఇండీ కూటమిలోని ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలకు రాహుల్ గాంధీనే కారణమని తీవ్ర ఆరోపణలు చేసింది. ఐక్యత గురించి స్పీచ్ లు అదరగొట్టే రాహుల్ గాంధీ కూటమిలో ఐక్యతను కాపాడలేకపోయారని దుయ్యబట్టింది. చాలా రాష్ట్రాల్లో ఆ ఐక్యతను బలహీనపరిచింది ఎవరు అని ప్రశ్నించింది. రాహుల్ గాంధీపై కేరళంలోని వామపక్ష పార్టీలు చేసిన విమర్శలను కూడా ఆ సంపాదకీయంలో డీఎంకే ప్రస్తావించింది. రాహుల్ గాంధీకి రాజకీయ పరిపక్వత లేదని, ఆయనకు స్థిరత్వం లేకపోవడం వల్లే కూటమిలో విభేదాలు వస్తున్నాయని అభిప్రాయపడింది. ఇండీ కూటమిలోని అనేక సమస్యలకు కాంగ్రెస్ స్వయంకృతాపరాధాలే కారణమని విమర్శించింది.

అయితే, తమిళనాడు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని తమిళనాడు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరి, డీఎంకే వ్యాఖ్యలు, విమర్శలపై రాహుల్ గాంధీ ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.