ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అమర్ నాథ్ వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు పలువురు టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను అమర్ నాథ్ వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, తాను మహిళలందరినీ ఉద్దేశించి విమర్శలు చేయలేదని, కేవలం ఒకరి వ్యాఖ్యలను మాత్రమే ఖండించానని అమర్ నాథ్ తన వ్యాఖ్యలపై వివరణనిచ్చే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే అమర్ నాథ్ కామెంట్లపై అనిత తొలిసారి స్పందించారు. తమ పార్టీకి చెందిన నేతలు ఒక్క మాట పొరపాటున మాట్లాడినా పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు మందలిస్తారని, కానీ, మిగతా పార్టీల సీఎంలు అలా ఎందుకు చేయరో తనకు అర్థం కాదని అన్నారు. మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారు, వ్యాఖ్యలు చేసేవారు తమకూ తల్లి, చెల్లి ఉన్నారన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
రెండేళ్ల కూటమి పాలనలో, హోం శాఖ పనితీరు, పోలీసులు సాధించిన విజయాలపై మాట్లాడేందుకు తాను ప్రెస్ మీట్ పెట్టానని, ఇటువంటి మంచి సందర్భంలో అటువంటి విజ్ఞత లేని వారి గురించి మాట్లాడి తనను తాను తగ్గించుకోదలుచుకోలేదని అనిత అన్నారు. తాను వేరే వేదికపై ఆ కామెంట్లపై తప్పకుండా స్పందిస్తానని అన్నారు. ఆ టాపిక్ గురించి మాట్లాడితే రెండేళ్లపాటు తన శాఖ పడ్డ కష్టానికి సంబంధించి పెట్టిన ఈ ప్రెస్ మీట్ పక్కదారి పడుతుందని చెప్పారు. సైబర్ క్రైమ్ గురించి పిల్లలు మొదలు పెద్దల వరకు అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates