జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్ చివరి కోరిక మేరకు అతడిని పరామర్శించేందుకు ఈ పర్యటన చేపడుతున్నారు. అభిమాన నాయకుడిని ఒక్కసారి కలవాలన్న చిన్నారి ఆకాంక్షను నెరవేర్చేందుకు పవన్ స్వయంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
చిన్నారిని పరామర్శించిన అనంతరం స్థానిక జనసేన నాయకులతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం కూడా ఏర్పడింది.
ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించాలనుకున్న ‘నవనిర్మాణ సభ’కు అనుమతి లభించకపోవడం, అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. సభకు అనుమతి నిరాకరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించడంతో పాటు తెలంగాణతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించగా, బీజేపీ మాత్రం పవన్‌కు మద్దతు తెలిపింది.
ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన పార్టీ కార్యక్రమంలోనూ పవన్ తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుపై అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో పాటు తెలంగాణలో పర్యటించేందుకు తనకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
ఈ పరిణామాల మధ్య వరంగల్ పర్యటన ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అధికారికంగా చిన్నారి నిరంజన్‌ను పరామర్శించేందుకే ఈ పర్యటన అయినప్పటికీ, తెలంగాణ రాజకీయాలపై కూడా పవన్ స్పందించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, తెలంగాణలో పార్టీ విస్తరణకు జనసేన వేగం పెంచినట్లు సమాచారం. త్వరలోనే రాష్ట్ర స్థాయి జాయినింగ్స్ కమిటీని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ వరంగల్ పర్యటన రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates