తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా నాలుగు కాళ్ల రోబోట్‌ డాగ్‌ పనితీరును టీటీడీ అదనపు ఈవో సి.హెచ్‌. వెంకయ్య చౌదరి గురువారం పద్మావతి అతిథిగృహం వద్ద అధికారులతో కలిసి పరిశీలించారు. అటవీ ప్రాంతాల్లో మనుషులు వెళ్లేందుకు ప్రమాదకరమైన, ఇబ్బందికరమైన ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేందుకు దీనిని వినియోగించే అవకాశాలపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ రోబోట్‌లో ఆప్టికల్‌ కెమెరా, థర్మల్‌ ఇమేజింగ్‌ కెమెరా, 360 డిగ్రీల లైడార్‌, వివిధ సెన్సార్లు, కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత ఉన్నాయి. వీటి ద్వారా చీకటి, పొగమంచు వంటి పరిస్థితుల్లోనూ వన్యప్రాణుల కదలికలను గుర్తించి పర్యవేక్షించవచ్చు. ఏఐ వ్యవస్థ పెద్ద జంతువులు, మనుషులు, వాహనాలు, పశువులను గుర్తించి వేర్వేరుగా వర్గీకరించగలదు. వన్యప్రాణుల కదలికలను గుర్తించిన వెంటనే భౌగోళిక స్థానం ఆధారంగా హెచ్చరికలు పంపడంతోపాటు, ప్రత్యక్ష వీడియో, థర్మల్‌ దృశ్యాలను నియంత్రణ కేంద్రం, గస్తీ సిబ్బందికి చేరవేసే అవకాశాన్ని పరిశీలించారు.

ముఖ్యంగా అలిపిరి–తిరుమల కాలిబాటకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణుల సంచారాన్ని ముందుగానే గుర్తించి భక్తులను అప్రమత్తం చేయడానికి ఈ సాంకేతికత ఉపయోగపడనుంది. అటవీ, విజిలెన్స్‌, భద్రతా సిబ్బంది వేగంగా స్పందించేందుకు ఇది దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

రోబోట్‌ ద్వారా సేకరించే వీడియోలు, థర్మల్‌ చిత్రాలు, వన్యప్రాణుల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వాటి సంచార తీరును మరింత సమర్థంగా అర్థం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. తద్వారా అవసరమైన ప్రాంతాల్లో గస్తీ సమయాలను, నిఘాను మరింత మెరుగుపరిచే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.