పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక సందేశం ఇచ్చారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే కార్యకర్తల ఆత్మగౌరవం దెబ్బ తినకుండా పోటీకి దిగాలని నిర్ణయం తీసుకుంది. అమరావతిలో జరిగిన జనసేన శాసనపక్ష సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పవన్ కళ్యాణ్ చర్చించారు.

జనసేన శ్రేణులు పోటీకి సిద్ధం కావాలని, పొత్తుల సంగతి నేను చూసుకుంటానంటూ వ్యాఖ్యానించారు. ఎవరూ పార్టీ లైన్ దాటొద్దని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 21 మంది జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిద్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ప్రస్తుత పార్టీ పరిస్థితి పై ఆరా తీసిన పవన్ కళ్యాణ్ పార్టీ బలబలాలను అడిగి తెలుసుకున్నారు.

ఇతర నియోజకవర్గాల్లో పరిస్థితి ఏమిటని వాకబు చేశారు. ఈసారి మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రత్యక్ష పద్దతిలో ఎన్నికలు జరుగుతాయని చెప్పిన ఆయన కిందిస్థాయి కార్యకర్తలతో సమన్వయం చేసుకొని వెళ్లాలని సూచించారు. విభేదాలు వీడి నాయకులు పనిచేయాలన్నారు.

స్థానిక ఎన్నికల్లో 80:15:5 నిష్పత్తి ప్రకారం కూటమి పార్టీలు పోటీ చేసేందుకు మంత్రి లోకేష్ ప్రతిపాదన చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని కొందరు ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అలాంటి ప్రతిపాదన ఏది తనవద్ద చర్చకు రాలేదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితి వేరు, ఇప్పుడు పార్టీ బలం పెరిగింది, కూటమి ఐక్యత దెబ్బ తినకుండా చూసుకుంటూ పోటీ చేద్దామని సలహా ఇచ్చారు.

అయితే కూటమితో కలిసి నడుస్తూనే స్థానిక ఎన్నికల్లో గెలవడం ద్వారా పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసుకోవాలన్న ఆలోచనలో జనసేన అధినేత వున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ధర్మానికి కట్టుబడి రాష్ట్రంలో అనేక చోట్ల పోటీ నుంచి తప్పుకున్నారని, వారికి స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించడం ద్వారా న్యాయం చేయాలని భావిస్తున్నారు. అందుకే మీరు పోటీకి సిద్ధంగా వుండాలని సంకేతాలు ఇస్తున్నారని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.