నిన్న మొన్నటి వరకు తననుమించిన నాయకురాలు లేదని.. జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పుతానని ప్రకటనలు గుప్పించి.. రాజకీయ సంచలనాలకు కేంద్రంగా మారిన పశ్చిమ బెంగాల్ అప్పటి ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ.. బీజేపీ దెబ్బతో అల్లల్లాడిపోతున్నారు. గత ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ.. అనంతరం.. తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచే ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. దీంతో ఇప్పుడు తన పార్టీనికాపాడుకునేందుకు కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు రెడీ అయ్యారని తెలిసింది.
ఎందుకు?
ప్రస్తుతం టీఎంసీ పార్టీకి 28 మంది ఎంపీలు ఉన్నారు. అలాగే.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయినా.. 80 మంది ఎమ్మెల్యేలు విజయం దక్కించుకున్నారు. కానీ, మమత అంటే ఇష్టమేనని పేర్కొంటున్నా.. ఆమె మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ వైఖరిని వారు విభేదిస్తున్నారు. ఈ క్రమంలోనే 64 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. పోనీ.. వీరిని నయానో.. భయానో.. బుజ్జగించాలని మమత ప్రయత్నించారు. కానీ, ఆప్రయత్నాలు కూడా చేతులు దాటిపోయాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు.. సంచలన నిర్ణయం తీసుకున్నారు.
64 మంది ఎమ్మెల్యేలు.. తమనే టీఎంసీ పార్టీగా గుర్తించాలని.. తమకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాశారు. ఇక, 20 మంది తిరుగుబాటు ఎంపీలు.. కూడా ఇదే పనిచేశారు. తాము ప్రత్యేక కూటమిగా ప్రధాని మోడీ నేతృత్వంలో ని ఎన్డీయే పక్షానికి మద్దతు ఇస్తామని.. ఈ మేరకు తమను ప్రత్యేక కూటమిగా గుర్తించాలని కోరుతూ.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ సమర్పించారు. దీనిపై త్వరలోనే నిర్ణయాలు రానున్నాయి. ఇదే మమతకు ఉక్కిరిబిక్కిరిగా మారింది. ఇదే జరిగి.. ఆయా ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా గుర్తిస్తే.. తాను కష్టపడి సాధించిన పార్టీ పేరు, గుర్తు వారికి దక్కుతాయి. అంతేకాదు.. పార్టీకి సంబంధించి బ్యాంకుల్లో ఉన్న ఆస్తుల్లోను, బయట ఉన్న స్థిరాస్తుల్లోనూ వాటాలు ఇవ్వాల్సి ఉంటుంది.
వ్యూహం మార్చి.. మెట్లుదిగి..
ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ.. తన వ్యూహం మార్చుకున్నారు. ముందు పార్టీని కాపాడుకుంటే.. తర్వాత.. ఎప్పుడైనా పైకి ఎదగొచ్చని భావించిన ఆమె.. కాంగ్రెస్ ముందుకు వచ్చారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన మమత అదే పార్టీ ముందు ఒకరకంగా మోకరిల్లారు. దీంతో సాక్షాత్తూ సోనియాగాంధీనే విలీన ప్రతిపాదనను తెరమీదికి తెచ్చారు.
వచ్చి మాలో కలిసిపోండి. మీకు మేం అండగా ఉంటాం. అని ఆమె చెప్పారు. ఈ వ్యవహారంపై మమత ఇంకా నిర్ణయం తీసుకోకపోయినా.. ఆలోచనలో పడ్డారు. బీజేపీ నుంచి తన పార్టీని ముఖ్యంగా పార్టీ గుర్తు ఆస్తులను కాపాడుకునేందుకు విలీనం తప్ప మరో మార్గం లేదని ఆమె భావిస్తున్నారు. అంతేకాదు.. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా చెక్ పెట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
