అయ్య‌న్న‌ అలా.. జ‌గ‌న్ ఇలా… ఇద్ద‌రి ఆశ‌లూ తీరేనా?

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు.. ఎప్ప‌టి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదికల‌పైనా ఆయ‌న త‌న వాణిని వినిపిస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా.. వేత‌నాలు తీసుకునే ఎమ్మెల్యేల‌ను ఉపేక్షించ రాద‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌. ఇది మంచిదే. ప్ర‌జ‌ల సొమ్మును ఊరికేనే ఇవ్వ‌డాన్ని ఎవ‌రూ స‌హించ‌రు. దీంతో ఆయన స‌భ‌కు రాకుండా వేత‌నాలు తీసుకునే వారిపై చ‌ర్య‌లు తీసుకునేలా.. ఆ సొమ్మును తిరిగి వ‌సూలు చేసుకు నేలా చ‌ట్టాన్ని రూపొందించాల‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌. త‌ద్వారా స‌భ అంటే గౌర‌వం, మ‌ర్యాద రెండూ పెరుగుతాయ‌ని క్ర‌మ‌శిక్ష‌ణ కూడా అల‌వ‌డుతుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు.

గ‌త ఏడాది రాజ‌స్థాన్‌లో జ‌రిగిన అంత‌ర్జాతీయ‌.. స‌భాప‌తుల స‌మావేశంలో కూడా.. అయ్య‌న్న పాత్రుడు ఈ విష‌యాన్ని ఎలుగెత్తారు. స‌భ‌ల‌కు రాకుండా త‌ప్పించుకుని.. నెల నెలా వేత‌నాలు పొందుతున్న స‌భ్యుల విష‌యంలో దృష్టి పెట్టాల‌ని సూచించారు. ఇక‌, పార్ల‌మెంటు స్పీక‌ర్ ఓం బిర్లాను రెండు సార్లు క‌లుసుకుని.. ఆయ‌న దీనికి సంబంధించిన విన‌తి ప‌త్రం కూడా అందించారు. ఇక‌, ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే బిల్లును రూపొందించి.. పంపాల‌న్న‌ది ఆయ‌న ప్లాన్‌. దీనికి ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

ఇక‌, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆకాంక్ష మరో విధంగా ఉంది. త‌మ‌కు 11 మంది స‌భ్యులు మాత్ర‌మే ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాల‌ని ఆయ‌న కోరుతున్నారు. దీనిపై కోర్టుకు కూడా వెళ్లారు. కానీ, అది ఏమైందో.. ఏద‌శ‌లో విచార‌ణ జ‌రుగుతోందో కూడా తెల‌య‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఫ‌లితంగా.. జ‌గ‌న్ ఆశ‌లు నెర‌వేర‌డం లేదు. మ‌రో రెండున్న‌రేళ్ల‌లో ప్ర‌భుత్వ స‌మ‌యం కూడా గ‌డిచిపోయి.. ఎన్నిక‌లు రానున్నాయి. అంతేకాదు.. వ‌చ్చే ఏడాది నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు. అంటే.. ఆయ‌న కోరుకుంటున్న‌ట్టు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఈ ఏడాది లోనే రావాల్సి ఉంటుంది.

ఇది అంత సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు.. ఉన్న 10 మందినైనా స‌భ‌కు పంపించ‌వ‌చ్చుక‌దా? అనే అంశాన్ని కూడా ఎటూ తేల్చ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కొత్త‌గా ఎన్నికైన న‌లుగురు ఎమ్మెల్యేలు.. ఇప్ప‌టి వ‌ర‌కు స‌భ ముఖం చూసింది లేదు. నిజానికి ఏ ఎమ్మెల్యేకైనా.. కొత్త‌గా ఎన్నిక‌య్యాక‌.. స‌భ‌కు రావాల‌ని ఉంటుంది. కానీ, ఈ విష‌యంలో జ‌గ‌న్ వారికి అడ్డు చెబుతున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తేనే వెళ్లాల‌ని.. అది కూడా సీఎం చంద్ర‌బాబు మాట్లాడినంత స‌మ‌యం త‌న‌కు స‌భ‌లో స‌మ‌యం కేటాయించాల‌న్న డిమాండ్ చేస్తున్నారు. కానీ.. ఈ ఆశ‌లు ఇప్ప‌ట్లో తీరేనా? అనేది సందేహం.