జైలు నేత‌లకు ప‌రామర్శ‌… సమర్థించుకున్నారా జగన్?

ప్ర‌స్తుతం వివిధ కేసుల్లో చిక్కుకుని.. జైలు పాలైన కొంద‌రు నాయ‌కుల‌ను, మాజీ మంత్రుల‌ను వైసీపీ అధినేత జ‌గ‌న్ ఓదారుస్తున్న విష‌యం తెలిసిందే. నేరుగా ఆయా జిల్లాలకు, జైళ్ల‌కు వెళ్లి నాయ‌కుల‌కు భ‌రోసా క‌ల్పిస్తున్నారు. అయితే.. ఈ జైలు ప‌రామ‌ర్శ‌ల‌పై సోష‌ల్ మీడియాలో సెటైర్లు ప‌డుతున్నాయి. అదే స‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పార్టీలైన టీడీపీ, జ‌న‌సేన నుంచి కూడా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. “జ‌గ‌న్‌కు జైలుకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఆయ‌న జైళ్ల‌కు వెళ్లి వ‌స్తున్నారు“ అని టీడీపీ సీనియ‌ర్ నేత ఒక‌రు వ్యాఖ్యానించారు.

తాజాగా ఈ వ్యాఖ్య‌లు వైసీపీ శాస‌న స‌భా ప‌క్షం స‌మావేశంలో ప‌లువురు ఎమ్మెల్సీలు ప్ర‌స్తావించారు. “జైలుకు వెళ్లి నాయ‌కుల‌ను ప‌రామ‌ర్శించినా.. టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.“ అంటూ ఓ మ‌హిళా ఎమ్మెల్సీ పేర్కొన్నారు. “జైలుకు వెళ్లి ఓదార్చ‌డం త‌ప్ప‌ట‌. గ‌తంలో టీడీపీ నేత‌లు కూడా ఇదే ప‌నిచేసినా.. మ‌న‌ల్ని విమ‌ర్శిస్తున్నారు“ అని మ‌రో ఎమ్మెల్సీ చెప్పారు. ఇలా.. ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. జ‌గ‌న్ జైలు ప‌రామ‌ర్శ యాత్ర‌ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారో కూడా చెప్పారు.

అయితే.. ఆయా విష‌యాల‌ను లైట్ తీసుకోవాల‌ని జ‌గ‌న్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. “మ‌న నాయ‌కులు, మ‌న మాజీ మంత్రులు. వారిపై అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారు. వారిని కాపాడుకునే బాధ్య‌త అంద‌రిపైనా ఉంది. మీరు కూడా వీలు కుదిరితే.. ప‌రామ‌ర్శించండి. వాళ్లేదో అనుకుంటున్నారు.. వీళ్లేదో అనుకుంటున్నార‌న్న‌ది మ‌న‌కు తెలిసిందే. మ‌నం మంచి చేసినా చెడుగా ప్ర‌చారం చేశారు. ఇప్పుడు జైల్లో ఉన్న నాయ‌కుల‌కు భ‌రోసా ఇవ్వ‌క‌పోతే.. వారు మ‌రింత బ‌లంగా పోరాటం చేయ‌లేరు. అందుకే విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు“ అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

గొడ్డలి పార్టీపై..

ఇక‌, సీఎం చంద్ర‌బాబు వైసీపీని గొడ్డ‌లి పార్టీ అంటూ వ్యాఖ్యానిస్తున్నార‌ని.. దీనివ‌ల్ల బ్యాడైపోతామ‌ని కొంద‌రు నాయకులు జ‌గ‌న్‌కు చెప్పారు. దీనికి ఆయ‌న ముసిముసిగా న‌వ్వుకున్నారు. అస‌లు ఈ పేరు ఎలా వ‌చ్చింద‌న్న విష‌యాన్ని ఆయ‌న ఆరా తీశారు. దీనికి వివేకా హ‌త్య‌కు సంబంధం ఉంద‌ని ఒక ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. అయితే.. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్న జ‌గ‌న్‌.. ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తార‌ని.. పేర్కొన్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లేది ఎవ‌రి నినాద‌మో.. ఎన్నిక‌ల వ‌ర‌కు వేచి చూడాల‌ని నాయ‌కుల‌కు తేల్చి చెప్పారు.