బాలయ్య స్టెప్ విషయంలో బాధపడ్డ మాస్టర్

టాలీవుడ్లో ప్రస్తుతం నంబర్ వన్ కొరియోగ్రాఫర్ స్థానానికి గట్టి పోటీదారుల్లో ఒకడు శేఖర్ మాస్టర్. గత దశాబ్ద కాలంలో అతను ఎన్నో పెద్ద సినిమాలకు కొరియోగ్రఫీ అందించాడు. ఐతే ఒక దశ వరకు తన స్టెప్స్ చాలా క్రియేటివ్‌గా ఉండేవి కానీ.. తర్వాత ఒక మూసలోకి వెళ్లిపోతున్నాడనే విమర్శలు వచ్చాయి. దీనికి తోడు తన స్టెప్స్‌లో వల్గారిటీ పెరిగిందనే విమర్శలు కూడా వచ్చాయి. ‘మిస్టర్ బచ్చన్’, పుష్ప-2’తో పాటు ‘డాకు మహారాజ్’ చిత్రాల్లోని పాటలు అందుకు ఉదాహరణ.

ముఖ్యంగా ‘డాకు మహారాజ్’లో ఊర్వశి రౌతెలాతో కలిసి బాలయ్య చేసిన ‘దబిడి దిబిడి’ పాటలో డ్యాన్స్ మూమెంట్ మరీ వల్గర్‌గా అనిపించింది. ఊర్వశి బ్యాక్ మీద బాలయ్య దరువు వేసే స్టెప్ మీద సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. స్వయంగా ఊర్వశినే ఈ స్టెప్ విషయంలో తన అసంతృప్తిని వెళ్లగక్కింది. ఐతే ఈ చిత్రం విడుదలైన ఏడాదిన్నర తర్వాత శేఖర్ మాస్టర్.. ఈ స్టెప్ విషయంలో పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘డాకు మహారాజ్’లోని ‘దరువు’ డాన్స్ మూమెంట్ కంపోజ్ చేసినందుకు తాను పశ్చాత్తాపపడుతున్నానని వ్యాఖ్యానించాడు. మాస్ ట్యూన్‌కి తగ్గట్లుగానే ఆ సీక్వెన్స్ క్రియేట్ చేశానని, అయితే ప్రేక్షకులు దానిని వేరే ఉద్దేశంతో అర్థం చేసుకుని వివాదాస్పదం చేస్తారని తాను ఊహించలేదని శేఖర్ అన్నాడు. ఆ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది తానే అనే విషయం చాలామందికి తెలియదని కూడా శేఖర్ పేర్కొనడం గమనార్హం. 

ఆలస్యంగా అయినా ఈ డ్యాన్స్ మూమెంట్ విషయంలో శేఖర్ రియలైజ్ అవడం మంచి విషయమే. కానీ ఆ స్టెప్ వల్గర్‌గా ఉందనే విషయం క్లియర్‌గా కనిపిస్తున్నా, ఈ విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేకపోయినా.. ప్రేక్షకులు అపార్థం చేసుకున్నారని పేర్కొనడమే విడ్డూరం. దీంతో పాటు ‘మిస్టర్ బచ్చన్’, ‘పుష్ప-2’ చిత్రాల్లోనూ హీరోయిన్ బ్యాక్ మీద తబలా వాయించడం కామన్‌గా కనిపిస్తుంది. అందులోనూ ‘మిస్టర్ బచ్చన్’లో అయితే హీరోయిన్ బొడ్డు కింద చేయిపెట్టి డ్రెస్ లాగడం లాంటి స్టెప్ చేయించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.