మార్పు త‌ప్ప‌దు మిత్ర‌మా… కూట‌మి తేల్చేసింది!

కూట‌మిలో నాయ‌కుల‌కు క‌లివిడిత‌ప్ప‌దు. ఈ విష‌యాన్ని గ‌తంలో అనేక సంద‌ర్భాల్లో టీడీపీ-జ‌న‌సేన కూడా స్ప‌ష్టం చేశాయి. అయిన‌ప్ప‌టికీ.. కొంద‌రు నాయ‌కులు మాత్రం త‌మ పంథాను మార్చుకోలేక పోతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఒంగోలు రాజ‌కీయం.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రావు వ‌ర్సెస్ ప్ర‌స్తుత ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్‌రావుల మ‌ధ్య ఏర్ప‌డిన మాట‌ల యుద్ధం.. కూట‌మిలో తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. ఆ వెంట‌నే పార్టీలు స‌మ‌న్వ‌య క‌మిటీని హాజ‌రు ప‌ర‌చ‌డం.. నాయ‌కుల‌కు కొన్ని సూచ‌న‌లు చేయ‌డం తెలిసిందే.

అయితే.. ఒక్క ఒంగోలు మాత్ర‌మే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా.. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. త‌ర‌చుగా నాయ‌కులు రోడ్డెక్కుతున్న ప‌రిస్తితి ఉంది. ఇక‌పై ఇవేవీ కూట‌మి ప‌ట్టించుకోద‌న్న సంకేతాలు తాజాగా ఇచ్చేవారు. పాత వైరాలు ప‌నిచేయవ‌ని.. కూట‌మిలో క‌ట్టుబ‌డి ఉండాల్సిందేన‌ని జ‌న‌సేన‌, టీడీపీలు తేల్చేశాయి. సో.. ఇక నుంచి నాయ‌కుల‌కు క‌లివిడి మంత్రం ఒక్క‌టే ఉంటుంది. ఇది కాద‌ని వ్య‌వ‌హ‌రిస్తే.. వారి ప్ర‌య‌త్నాలు వారు చేసుకోవ‌డ‌మో.. లేక‌.. మ‌రో మార్గం చూసుకోవ‌డ‌మో తప్ప‌దు.

టార్గెట్ పెద్ద‌ద‌నే!

మ‌రో 15 సంవ‌త్స‌రాలు రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం కొన‌సాగాల‌ని సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు నిర్దేశించుకున్న ద‌రిమిలా.. పైస్థాయిలో క‌లివిడిత‌నం క‌నిపిస్తోంది. వాస్త‌వానికి కొన్ని కొన్ని చిక్కులు ఉన్నాయ‌ని… భ‌విష్య‌త్తులో ఇంకా ఉంటాయ‌ని అయినా స‌ర్దుకు పోవాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు మాసాల కింద‌టే కాకినాడ స‌భ‌లో చెప్పుకొచ్చారు. టార్గెట్ పెద్ద‌ది అయిన‌ప్పుడు.. ఇవ‌న్నీ చిన్న‌వేన‌ని చెబుతున్నారు. త‌ద్వారా కూట‌మిలో అంత‌ర్గ‌త రచ్చ‌కు అవ‌కాశం లేద‌ని కూడా అంటున్నారు.

మార్పు వ‌స్తుందా?

కూట‌మి పార్టీలు ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత‌.. ఒంగోలు రాజ‌కీయాల వేడి త‌గ్గింది. అయితే.. ఇలానే రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతుంద‌ని అనుకున్నా.. ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌న్న‌ది మాత్రం సందేహ‌మే. టికెట్లు ఆశించే వారు.. ప‌ద‌వులు ద‌క్కాలని కోరుకునే వారు.. ఎన్నిక‌ల స‌మ‌యానికి మార‌తారా? లేక‌.. పాత ప‌ద్ధతిలోనే ఉంటారా? అనేది చూడాలి. అయితే..అది ఎలా ఉన్నా.. ప్ర‌స్తుతం మాత్రం కూట‌మి పార్టీల మ‌ధ్య క‌లివిడి అత్యంత కీల‌క‌మ‌ని పార్టీలు చెబుతున్నా.. మౌన‌మే మంచిద‌న్న‌ట్టుగా నాయ‌కులు ఉంటున్నారు. అంటే.. నాయ‌కులు చేతులు క‌ల‌ప‌క‌పోయినా.. మౌనంగా ఉండే అవ‌కాశం మాత్ర‌మే క‌నిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.