ఇదేమీ ఊహాజనిత వార్తకాదు. కొందరు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలో గత రెండు రోజులుగా జరుగుతున్న అత్యంత గోప్యమైన చర్చ!. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పార్టీపగ్గాలను తన నుంచి తన వారసుడు.. మాజీ మంత్రి కేటీఆర్‌కు అప్పగించేయాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై ఆయన అత్యంత సన్నిహిత మేధావులతో ఫామ్ హౌస్‌లో చర్చలు కూడా ప్రారంభించారని సమాచారం.
వీరిలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, తెలంగాణకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి కూడా ఉన్నారన్నది బీఆర్ఎస్ నేత ఒకరు చెప్పిన మాట. వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా ప్రొజెక్టు చేయడం ద్వారా తెలంగాణ సెంటిమెంటును రగిలించడం ద్వారా.. మరోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ పార్టీ తొలినాళ్లలో అంచనా వేసుకుంది. అయితే.. ప్రస్తుతం మారుతున్న పరిణామాలు.. `జెన్‌జీ` ఎఫెక్ట్ వంటివాటిని అంచనా వేసుకుంటున్న కేసీఆర్.. ఇక. .. పార్టీ పగ్గాలను తన వారసుడు కేటీఆర్‌కు అప్పగించడమే మంచిదన్న భావనలో ఉన్నారని తెలుస్తోంది.
ఇటీవల పార్టీ నేత.. పెద్ది మృతి చెందిన తర్వాత.. కేసీఆర్‌లో కొంత గాబరా పెరిగిందన్న వార్తలు కూడా వస్తున్నాయి. భవిష్యత్తు రాజకీయాలు మారుతుండడం.. అంత యాక్టివ్‌గా తాను లేకపోవడం వంటివి పరిగణనలోకి తీసుకున్న ఆయన.. వారసుడిని ప్రకటించి.. పగ్గాలు అప్పగించేయడమే మంచిదని భావిస్తున్నట్టు సమాచారం. నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన కొందరు మేధావులతో ఆయన అత్యంత గోప్యంగా చర్చలు జరుపుతున్నట్టు చెబుతున్నారు.
ఎలానూ కుమార్తె కవిత.. సొంత కుంపటి పెట్టుకున్న దరిమిలా.. కేటీఆర్‌కు పోటీగా ఎవరూ లేకపోవడం.. హరీష్‌రావు పార్టీ లైన్‌ను ఎలానూ మీరే అవకాశం లేదన్న సంకేతాలు కూడా బలంగా ఉన్నదరిమిలా.. ఇక, త్వరలోనే కేటీఆర్‌కు పట్టాభిషేకం చేయడం ద్వారా పార్టీలో యూత్‌ను నిలబెట్టుకునేదిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లో జరిగిన పరిణామాలను కూడా ఆయన అంచనా వేస్తున్నారు. బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ తన పార్టీని తన కుమారుడు తేజస్వికి ఎప్పుడో అప్పగించారు.
ప్రస్తుతం యువ నేతలతో పార్టీ బలంగానే ఉంది. ఇక, కర్ణాటకలో మాజీ ప్రధాని దేవెగౌడ తన పార్టీ జేడీఎస్‌ను కూడా ఎప్పుడో కుమారస్వామికి అప్పగించారు. అలానే దివంగత రామ్ విలాస్ పాశ్వాన్.. లోక్‌జనశక్తిపార్టీని తన కుమారు డికి జీవించి ఉన్న సమయంలోనే అప్పగించారు. ఇలా.. ఆయా పరిణామాలను అంచనా వేసుకుని.. తాను పార్టీకి సుప్రీంగా వ్యవహరిస్తూనే.. అధ్యక్ష బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగిస్తే.. ఎలా ఉంటుందన్న అంశంపై అంతర్మథనం చేస్తున్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయానికి రానున్నారని.. ప్రకటన కూడా ఈ ఏడాదిలోనే ఉంటుందని సీనియర్ నేత ఒకరు చెప్పడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates