కదిరి వెనుక అసలు కహాని

నిన్న జరిగిన కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ లో చిరంజీవి మెగా 158 గురించి ఇచ్చిన లీక్ అభిమానుల్లో రకరకాల అనుమానాలు లేవనెత్తింది. కదిరి టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా ఆయనిచ్చిన సంకేతం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. నిజంగా అదే పేరా లేక సగం చెప్పి వదిలేశారానే డౌట్లు బోలెడు పుట్టుకొస్తున్నాయి. ఒక ఫ్యాన్ వర్గం ఒక అడుగు ముందుకేసి ‘కదిరి శివయ్య నాయుడు’ పేరుతో ఏకంగా పోస్టర్లు తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఇదేంటయ్యా అంటే మాకు మెగా కాంపౌండ్ నుంచి తెలిసింది, ఇదే ఫిక్సని అంటున్నారు. నిజానికి మెగా 158 కు ముందు నుంచి ఈ పేర్ల బెడద ఉంది. ఒక దశలో ‘కాకాజీ’ అని ‘కాకా’ అని ఏవేవో తెరమీదకు తీసుకొచ్చారు. ఇప్పుడు కదిరి అని హింట్ ఇచ్చారు కాబట్టి ‘కదిరి డాన్’ అనో లేదా ‘కదిరి దాదా’ అనో పెట్టినా ఆశ్చర్యం లేదు. నిజానికి చిరంజీవి ఈ టాపిక్ తేకపోయి ఉంటే అసలే సమస్యా లేదు. తమన్ అన్నట్టు దర్శకుడు బాబీ ఏదైతే జరగకూడదని కోరుకున్నాడో అదే జరిగింది.

మెగాస్టార్ సైతం గుర్తించాల్సింది ఒకటుంది. ఒక సినిమా హైప్ ఏ స్థాయిలో ఉందనే దాన్ని బట్టి లీక్స్ పట్ల ఎగ్జైట్ మెంట్ ఎక్కువా తక్కువా ఉంటుంది. మన శంకరవరప్రసాద్ గారు ఎంత బ్లాక్ బస్టర్ అయినా తర్వాత వస్తున్న మూవీ ఏదనే కన్ఫ్యూజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలు విశ్వంభర అంటే నాకు తెలియదన్న రేంజ్ లో చిరు ఎక్కడా దాని ప్రస్తావన తేవడం లేదు. ఒకవేళ నిజంగా లీక్ ఇవ్వాలనుకుంటే విశ్వంభర రిలీజ్ డేట్ రివీల్ చేసి ఉండొచ్చు.

ఎంత వాల్తేరు వీరయ్య కాంబినేషన్ అయినా మెగా 158 మీద హైప్ మొదలవ్వాలంటే ముందు టీజర్ లాంటిది బయటికి రావాలి. అంతే తప్ప కేవలం పేరుతో ఏదో హంగామా జరిగిపోదు. కమర్షియల్ మూవీనే కాబట్టి కామన్ ఆడియన్స్ లో విపరీతమైన ఉత్సుకత ఏం లేదు. ముందైతే అసలు స్టోరీ బ్యాక్ డ్రాప్ ఏంటి, ఎవరెవరు ఉన్నారు లాంటి విషయాలు బయటికి రావాలి. తమన్ సంగీతం సమకూరుస్తున్న మెగా 158లో ఛాంపియన్ ఫేమ్ అనస్వర రాజన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.