మానవత్వం చూపండి: జగన్

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డ ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలను వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పమార్శించారు. బాదితుల పరామర్శ కోసం బుధవారం విశాఖ పర్యటనకు వచ్చిన జగన్… తొలుత బాధిత కుటుంబాలను సందర్శించి ఆయా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదంలో గాయపడ్డ కార్మికులను కూడా జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ తరహా ప్రమాదాలు జరిగినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాలని, బాధితుల పట్ల మానవత్వాన్ని చూపాలని ఆయన అన్నారు.

ఈ తరహా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వాలు ఇతోదికంగా ఆదుకోవాల్సి ఉందని జగన్ అబిప్రాయపడ్డారు. బాదిత కుటుంబాల పట్ల అలసత్వం ప్రదర్శించరాదని కూడా ఆయన పేర్కొన్నారు. అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాదితులకు ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులు, కార్మికులకు రావాల్సిన గ్రాట్యూటీ, ఇన్సూరెన్స్, పీఎఫ్ వంటి వాటిని ఇప్పించడం తప్పించి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చిందని ఆయన ప్రశ్నించారు. తామేదో బాదిత కుబుంబాలకు రూ.1.72 కోట్లు ఇచ్చామని గొప్పలు చెబుతున్న మంత్రి లోకేశ్… అసలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమిచ్చారన్న విషయాన్ని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరించడానికి యత్నిస్తే… ఆ యత్నాలను అడ్డుకున్నది వైసీపీనేనని, నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయరాదంటూ తమ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని ఆయన అన్నారు. నాడు తమ ప్రభుత్వం చేసిన తీర్మానంతోనే విశాఖ ఉక్కును కేంద్రం ఇంకా ప్రైవేటీకరణ చేయకుండా ఆగిందని ఆయన తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పడకుండా ఉండాలంటే తమ మాదిరే కూటమి సర్కారు కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాదని ఆయన చెప్పుకొచ్చారు.

ఓ వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ నుంచి కాపాడామని చెబుతున్న కూటమి ప్రభుత్వం… ప్లాంట్ లో సిబ్బంది సంఖ్యను దాదాపుగా సగం మేర తగ్గించిందని జగన్ ఆరోపించారు. వైసీపీ అదికారం నుంచి దిగిపోయేనాటికి స్టీల్ ప్లాంట్ లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 28 వేలుగా ఉందన్న జగన్.. గడచిన రెండేళ్లలోనే కూటమి సర్కారు ఆ సంఖ్యను 16 వేలకు తగ్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఉద్యోగులను తగ్గించి స్టీల్ ప్లాంట్ ను దొడ్డిదారిన అమ్మేయడానికి కూటమి సర్కారు కుటిల యత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించే నిమిత్తం కేంద్రం గతంలో రూ.11 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని కూడా ప్రస్తావించిన జగన్… ఆ నిధులను కంపెనీ విస్తరణకో, కంపెనీలో భద్రతా చర్యలను చేపట్టడానికో ఉపయోగించలేదని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న 6,500 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకే ఆ నిధులను వినియోగించారని ఆయన అన్నారు. అంతేకాకుండా శాశ్వత ఉద్యోగుల్లోనూ చాలా మందిని వీఆర్ఎస్ కు పంపారని ఆయన ఆరోపించారు. సిబ్బందిని తగ్గించేందుకు, జీఎస్టీ బకాయిలు చెల్లించేందుకు, బ్యాంకుల వడ్డీలు చెల్లించేందుకే ఆ నిధులు వాడారని ఆయన ఆరోపించారు.