మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ కిందే పరిగణించరు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది. తనను వేధించిన సమస్యను ఆ పార్టీ అంత ఈజీగా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే నిరసనలకు దిగిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ… తాజాగా గురువారం నాడు ఓ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ భేటీలో తనను వేధించిన సమస్యపై ఏ రీతిన పోరాటం చేయాలన్న దానిపై మాత్రమే చర్చించనుంది.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన రాజ్యసభ నామినేషన్ ను ఓ చిన్న కారణం చూపి రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఓ రాజ్యసభ సీటు చేజారితే ఏ పార్టీ అయినా దానిని అంత పెద్ద సమస్యగా పరిగణించదు.

అయితే మీనాక్షి విషయాన్ని కాంగ్రెస్ అలా పరిగణించే సమస్య కనిపించడం లేదు. ఎందుకంటే… కేసుల విషయాన్ని ప్రస్తావించలేదని చెప్పిన రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ ను తిరస్కరించారు కదా. ఆ కేసు కాంగ్రెస్ అదికారంలో ఉన్న తెలంగాణలో నమోదు అయిన కేసు కదా. అంటే… తన పాలనలో ఉన్న చోట తన నేతపై కేసు నమోదు అయితే… ఆ కేసు ఆధారంగా తనకు రాజ్యసభ సీటు చేజారితే అది పెద్ద సమస్యే కదా. కాంగ్రెస్ ఇదే రీతిన యోచిస్తోంది.

అసలు మీనాక్షిపై తెలంగాణలో కేసు నమోదు కావడం ఏమిటన్నదే అంతు చిక్కని సమస్యగా పరిణమించిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో అదికార పార్టీ కాంగ్రెస్సే కదా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే మీనాక్షి తెలంగాణకు వచ్చారు కదా.

మరి ఆమెపై తెలంగాణలో కేసు నమోదు అయితే అది కాంగ్రెస్ పాలనలో నమోదు అయిన కేసే కదా. ఈ విషయాన్ని ఇప్పుడు పట్టి లాగితే… పార్టీలో వర్గ విభేదాలు వెల్లువెత్తే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్.. తప్పును కేంద్ర ఎన్నికల సంఘం మీదకి తోసేసి… ఆ నిందను చివరకు బీజేపీ మెడకు చుట్టాలనే దిశగా కదులుతున్నట్లుగా సమాచారం.

ఈ తరహా వ్యూహంతో సాగుతున్న కాంగ్రెస్… తప్పు ఎక్కడ జరిగిందన్న విషయాన్ని పక్కనపెట్టేసి… తమ అభ్యర్థి నామినేషన్ ను తిరస్కరించడం తప్పేనన్న వాదనను భుజానికెత్తుకుంది. అంతేకాకుండా తన అభ్యర్థి చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశాన్ని ఇవ్వాలని ఈసీని పట్టుబడుతోంది.

నామినేషన్ లో వివరాల దిద్దుబాటుకు తాజా మాజీ ఎంపీ పరిమళ్ నత్వానీకి అవకాశం ఇచ్చి… తన అభ్యర్థికి ఎందుకు ఇవ్వరని ఆ పార్టీ వాదిస్తోంది. వెరసి తన అభ్యర్థి చేసింది చిన్న పొరపాటేనని… దానిని దిద్దుకునే అవకాశాన్ని ఇవ్వాలని పట్టుబడుతున్న కాంగ్రెస్.. గురువారం నాటి సమావేశంలో ఏ తరహా నిరసనలకు వ్యూహాలను రచిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.