ముగ్గురు ఫైనల్… ఇంకొకరు తేలాలి!

ఏపీ నుంచి ఈ దఫా రాజ్యసభ సభ్యత్వాలను దక్కించుకునే నేతలు ఎవరన్న విషయంపై ఓ స్పష్టత అయితే వచ్చిందనే చెప్పాలి. ఈ దఫా ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. వాటిని భర్తీ చేసేందుకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగా… ఆయా పార్టీల నుంచి అభ్యర్థిత్వాలు కూడా దాదాపుగా ఖరారు అయ్యాయి. ఏపీ నుంచి నలుగురు కొత్తగా రాజ్యసభకు ఎన్నిక కానుండగా… ఈ నాలుగూ కూటమికే దక్కనున్నాయి. కూటమిలోని టీడీపీకి మూడు సీట్లు దక్కగా… మిత్రపక్షం జనసేనకు ఓ సీటు దక్కింది.

జనసేనకు దక్కిన తొలి రాజ్యసభ సీటును ఆ పార్టీ అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మిత్రుడు, పార్టీకి ఆర్థికంగా నిలుస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ కు కేటాయించారు. ఈ మేరకు శుక్రవారమే జనసేన నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

ఇక టీడీపీకి దక్కిన మూడు సీట్లలో రెండు సీట్లకు సంబంధించిన అభ్యర్థులు ఖరారయ్యారు. వీరిలో ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీశ్ బాబు ఒకరు కాగా… భాష్యం విద్యా సంస్థల అధినేత భాస్యం రామకృష్ణ మరొకరు. వీరి అభ్యర్థిత్వాలు ఖరారు అయినా.. పార్టీ నుంచి అదికారిక ప్రకటన మాత్రం విడుదల కావాల్సి ఉంది. శనివారం ఈ మేరకు ప్రకటన రానుంది.

ఇక మిగిలి ఉన్న మరో రాజ్యసభ సీటు విషయంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ సీటును ఎవరికి కేటాయించాలన్న విషయంపై ఇప్పటికే సుదీర్ఘ కసరత్తు చేసిన చంద్రబాబు…ఓ ఇద్దరి పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు సమాచారం. వీరిలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడి రాజకీయ వారసుడు చింతకాయల విజయ్ తో పాటుగా మాజీ ఎమ్మెల్సీ వర్ల రామయ్యలు ఉన్నారు. వీరిద్దరిలోనే ఎవరో ఒకరిని ఈ సీటు వరించనుంది.

చింతకాయల విజయ్ విషయానికి వస్తే… ఈ సీటును బీసీలకు ఇవ్వాలన్న నిర్ణయం జరిగితే విజయ్ రాజ్యసభకు వెళ్లడం ఖాయమే. పార్టీలో సీనియర్ మోస్ట్ నేతగా కొనసాగుతున్న అయ్యన్న.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో తన రాజకీయ వారసుడిగా విజయ్ కి ఇవ్వాలని భావిస్తున్నానని, ఆ దిశగా విజయ్ కు టికెట్ ఇవ్వాలని గత ఎన్నికల్లోనే అయ్యన్న పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. అయితే జనసేన, బీజేపీలతో టీడీపీ పొత్తు నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో విజయ్ కి అవకాశం దక్కలేదు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో సత్తా చాటుతున్న విజయ్ కి ఇప్పుడు రాజ్యసభ సీటు దక్కితే… అదో మంచి నిర్ణయమేనన్న వాదన వినిపిస్తోంది.

ఇక వర్ల రామయ్య విషయానికి వస్తే… పార్టీ వర్ల కూడా సీనియర్ నేత కిందే లెక్క. పార్టీకి ఆది నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న వర్ల… 2019 ఎన్నికల్లో పరాజయం పాలైన పార్టీకి అండదండగా నిలిచారు. వైసీపీ సర్కారుకు ఏమాత్రం బెదరని వర్ల… టీడీపీ తరఫున తనదైన శైలిలో పోరాటం సాగించారు.

హేమాహేమీలే ఒకింత పక్కకు తప్పుకున్నా… రామయ్య మాత్రం వెన్ను చూపలేదు. అంతేకాకుండా ఈ దఫా రాజ్యసభ సీటును ఎస్సీ వర్గంలోని మాదిగలకు ఇవ్వాలని చంద్రబాబు గతంలోనే ఓ అభిప్రాయానికి వచ్చారు. ఈ నిర్ణయమే ఫైనల్ అయితే వర్లకు రాజ్యసభ సీటు దక్కడం ఖాయమేనని చెప్పాలి. మొత్తంగా ఇప్పటికే ఖరారు అయిన సానా, భాస్యం పేర్లతో పాటు విజయ్, రామయ్యలలో ఒకరి అభ్యర్థిత్వాలను శనివారం టీడీపీ అధికారికంగా ప్రకటించనుంది.