తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పని అయిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఆయన సహా.. ఆయన పార్టీ బీఆర్ ఎస్‌కు కూడా.. గతమే తప్ప.. భవిష్యత్తు లేదన్నారు. చెప్తున్న కదా.. కేసీఆర్.. చెల్లని వెయ్యి నోటుతో సమానం. రద్దయిన వెయ్యి రూపాయల నోటుకు విలువ ఉందా? .. అట్లే.. కేసీఆర్‌కు కూడా విలువ లేదు. ఇంక ఆ పార్టీ నాయకులు చేసే వ్యాఖ్యలకు కూడా అంతే విలువ లేదు అని రేవంత్ రెడ్డి చెప్పారు.
పైసాకు కూడా విలువ లేని నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్నారు.. అని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డిని ఏదో అంటే తాము ఎదుగుతామని బీఆర్ ఎస్ నాయకులు భావిస్తున్నారు. కానీ, విలువ లేని నాయకులు చేసే వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోరని చెప్పారు. ఏ ఎన్నికలు వచ్చినా.. రేవంత్ వైపే ప్రజలు ఉన్నారన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల కోసం కొందరు డ్రామాలు ఆడుతున్నారని…. దుయ్యబట్టారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు.
కూలేశ్వరం..
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును మరోసారి కూలేశ్వరం అంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. కూలేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత.. దాని నుంచి చుక్కనీరు కూడా తీసుకోలేదని తెలిపారు. అయినా .. కూడా రైతులు భారీగా వరి పండించారని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా అవినీతికి పాల్పడిన వారు.. ఇప్పుడు నీతులు చెబుతుంటే.. ఎవరు నమ్ముతారని నిలదీశారు.
త్వరలోనే పూర్తి..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాజెక్టుల పూర్తికి అధ్యయనం చేస్తున్నట్టు సీఎం తెలిపారు. ముఖ్యంగా బ్యారేజీపై బ్రిడ్జ్‌లను నిర్మించేందుకు అధ్యయనం కొనసాగుతోందని.. త్వరలోనే అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసిన తర్వాతే.. ఇక్కడి ప్రజలను తాను మరోసారి కలుస్తానని చెప్పారు. భూసేకరణ విషయంలో రైతులకు అన్యాయం జరగదని.. సాధ్యమైనంత తక్కువ భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates