వైసీపీ అధినేత జగన్‌పై ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని.. ఆస్తులు సంపాయించారని. వ్యాపారాలు చేపట్టారన్న వాదన కూడా ఉంది. దీనిపై కేసులు నమోదు కావడం.. ప్రస్తుతం అవన్నీ కోర్టుల విచారణ పరిధిలో ఉండడం తెలిసిందే. దాదాపు 10 సంవత్సరాలకు పైగానే..జగన్ బెయిల్‌పై ఉన్నారు.
అయితే.. తాజాగా మరో కేసు జగన్ మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా వస్తున్న సూచనల ప్రకారం.. జగన్‌ను ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ అధికారులు.. విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. జగన్‌కు నోటీసులు ఇవ్వడం ఖాయమని సమాచారం. దీంతో ఆయనను కేవలం విచారిస్తారా? లేక.. అరెస్టు కూడా చేసే అవకాశం ఉందా? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఏపీలో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏం జరిగింది?
ఏపీలో వైసీపీ హయాంలో మద్యం అక్రమాలు జరిగాయని.. ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అత్యంత నాసిరకమైన మద్యాన్ని ఖరీదుకు అమ్మి సోమ్ము చేసుకున్నారు. ప్రైవేటుగా చేయాల్సిన మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే చేసి.. తద్వారా 3500 కోట్ల రూపాయలకు పైగా అవినీతి పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంపైనే కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఇప్పటికి 38 మందిని అరెస్టు చేసి.. విచారించారు. కొందరు బెయిల్‌పై బయటకు వచ్చారు.
మరి జగన్ పాత్ర ఏంటి?
ఈ మొత్తం అక్రమాల్లో మద్యం విధానాన్ని మార్చడం నుంచి తమకు అనుకూలంగా ఉన్న కంపెనీలను ఎంపిక చేసుకునే వరకు వైసీపీ అప్పటి, ఇప్పటి ఎంపీ మిథున్‌రెడ్డి కీలక పాత్ర పోషించారన్న వాదన ఉంది. అంతేకాదు.. ఇలా సంపాయించిన సొమ్ము.. చివరకు జగన్ ఖాతాలకే చేరిందన్నది కీలక అంశం.
ఈ దిశగానే అటు సిట్ అధికారులు.. ఇటు ఈడీ అధికారులు కూడా దృష్టి పెట్టారు. జగన్‌కు అంతిమ లబ్ధి చేకూరిందని వారు సమాచారం సేకరించారు. ఈ క్రమంలో జగన్‌ను విచారించి.. అసలు విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. మరి ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేస్తారా? లేదా ? అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates