దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో అధికార మార్పిడి ఎట్టకేలకు పూర్తి అయ్యింది. ప్రభుత్వం కాంగ్రెస్ దే అయినప్పటికీ… ఆ పార్టీ పాలనా పగ్గాలు మొన్నటిదాకా సీనియర్ నేత సిద్ధరామయ్య చేతుల్లో ఉండగా… తాజాగా బుధవారం ఆ బాధ్యతలను పార్టీకి వీర విధేయుడిగా పేరున్న డీకే శివకుమార్ కు దఖలు పడ్డాయి.
రోజుల తరబడి కాంగ్రెస్ అధిష్ఠానం మంతనాలు సాగించి… ఏ ఒక్కరినీ నొప్పించకుండా అధికార మార్పిడిని అత్యంత పకడ్బందీగా పూర్తి చేసింది. బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ల సమక్షంలో కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణం చేశారు.
సీఎంగా పదవీ బాధ్యతలు చేసిన డీకే… 12 మందితో కొత్త కేబినెట్ ను ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ అధిష్ఠానం అనుమతితో డీకే… ఎంపిక చేసిన 12 మంది నేతలతో మంత్రులుగా ప్రమాణం చేయించారు. కొత్త మంత్రుల్లో తాజా మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా ఉన్నారు.
డీకే, సిద్దూల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు డీకే కేబినెట్ లో యతీంద్రకు కీలక శాఖ దక్కే అవకాశాలున్నాయి. ఇక ఐదుగురు డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేస్తారని భావించినా… పరమేశ్వర్ ఒక్కరే డిప్యూటీగా ప్రమాణం చేశారు. త్వరలోనే డీకే తన మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరించే అవకాశాలున్నాయి.
ఇదిలా ఉంటే… సీఎం పదవి నుంచి దిగిపోయిన సిద్ధరామయ్యను పార్టీ అధిష్ఠానం మరో కీలక పదవితో గౌరవించింది. పార్టీలో అత్యంత క్రియాశీలక విభాగం అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో ఆయనకు చోటు ఇచ్చింది. సిద్ధరామయ్యను సీడబ్ల్యూసీలో సభ్యుడిగా నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరిట ఓ కీలక ప్రకటన వెలువడింది.
సీఎంగా దిగిపోతున్న సిద్దూ… ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని.. దానికి తననే కన్వీనర్ గా నియమించాలన్న డిమాండ్ పెట్టగా… ఆ ప్రతిపాదనను పార్టీ తిరస్కరించింది. ఈ క్రమంలో సిద్ధరామయ్య అసంతృప్తికి గురి కాకుండా ఉండేలా… ఆయనను సీడబ్ల్యూసీలో సభ్యుడిగా నియమించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates