పవన్ సభకు తెలంగాణ పోలీసుల ‘నో’

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న పవన్ కు చుక్కెదురైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు హైదరాబాద్ లో పవన్ చేపట్టదలిచిన సభకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంతోపాటు శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ సభకు అనుమతినివ్వలేమని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే సభకు అనుమతినివ్వాలని కోరుతూ జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో, కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.

‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం’ సభను జనసేన తలపెట్టిన సంగతి తెలిసిందే. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ సభను అట్టహాసంగా నిర్వహించాలని జనసేన నేతలు భావించారు.

తెలంగాణలో యువత లక్ష్యంగా జనసేనను బలోపేతం చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ కార్యక్రమాన్ని పవన్ తలపెట్టారు. తెలంగాణ నలుమూలలా గర్జించేందుకు జనసేనను సన్నద్ధం చేయడమే టార్గెట్ గా ఈ సభను నిర్వహించాలని భావించారు.

తెలంగాణలో పార్టీని గ్రామ స్థాయి నుంచి విస్తరించడం, భవిష్యత్ కార్యచరణ, పొలిటికల్ యాక్షన్ ప్లాన్‌ను ఈ సమావేశం ద్వారా పవన్ ప్రకటించాలని భావించారు. తెలంగాణవ్యాప్తంగా ఉన్న జనసేన ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ సభకు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.